గుంటూరు జిల్లాలో వైసీపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో బాపట్ల ఒకటి. గత రెండు పర్యాయాలుగా ఈ నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధిస్తూ వస్తుంది. వైసీపీ తరుపున కోన రఘుపతి విజయం సాధిస్తూ వచ్చారు. బాపట్ల రాజకీయాల్లో తనదైన చెరగని ముద్రవేసుకున్న కోన ప్రభాకరరావు వారసుడుగా రాజకీయాల్లో వచ్చిన కోన రఘుపతి, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ తరుపున గెలుస్తూ వచ్చారు.


ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్, కోనకు డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించారు. సౌమ్యుడుగా ముద్రవేసుకున్న కోన రఘుపతి, అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని సైతం మెప్పించేలా పనిచేస్తున్నారు. అటు రాజకీయంగా దూకుడుగా విమర్శలు చేయరు. అసెంబ్లీ ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తూ, మిగతా సమయంలో నియోజకవర్గానికి పరిమితమై, ప్రజలకు సేవ చేస్తుంటారు.


బాపట్లలో వైసీపీ వాళ్ళకే కాదు, టీడీపీ-జనసేనలకు సపోర్ట్‌గా ఉన్న ప్రజలకు సైతం అండగా ఉంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు. కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన వైద్యసదుపాయలు అందేలా కృషి చేస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటున్నారు. అసలు వివాదాల జోలికి వెళ్లని కోన, ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబుని గానీ, ఆ పార్టీ నేతలని పెద్దగా విమర్శించిన సందర్భాలు లేవు. అందుకే నియోజకవర్గంలో ఏ పార్టీ వారైనా సరే కోనని అభిమానిస్తుంటారు.


ఇక రాజకీయంగా చూసుకుంటే బాపట్లలో కోన బలంగానే ఉన్నారు. ఇటీవల పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ మంచి విజయాలు సాధించింది. అటు టీడీపీ తరుపున వేగేశన సతీశ్ వర్మ పనిచేస్తున్నారు. సౌమ్యుడిగా, వివాద ర‌హితుడిగా ఉన్న సతీశ్ బాపట్లలో టీడీపీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. టీడీపీ ఇక్కడ చివరిగా 1999 ఎన్నికల్లోనే గెలిచింది. అప్పటినుంచి బాపట్లలో టీడీపీ జెండా ఎగరలేదు. దీంతో నెక్స్ట్ ఎలాగైనా పార్టీని గెలిపించాలనే కసితో సతీశ్ పనిచేస్తున్నారు. ప్రజల సమస్యలపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. సొంత డబ్బులు సైతం ఖర్చు పెడుతూ, పేద ప్రజలకు అండగా ఉంటున్నారు. ఇన్‌చార్జ్‌గా వచ్చిన దగ్గర నుంచి ప్రతి కుటుంబానికి దగ్గరవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో కోనకు చెక్ పెట్టడం సతీశ్‌ వల్ల అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: