బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం యువ కథానాయికగా మంచి అవకాశాలతో దూసుకెళ్తున్నారు అలియా భట్. తొలిసారిగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ద్వారా పరిశ్రమకి కథానాయికగా పరిచయం అయిన అలియా, ఆ సినిమాతో మంచి పేరు అందుకున్నారు. అనంతరం హైవే, టూ స్టేట్స్, ఉడ్తా పంజాబ్, డియర్ జిందగీ, గల్లి బాయ్, కలాంక్ , రాజీ, వంటి సినిమాలతో కథానాయికగా ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేక పేరు అందుకున్నారు అలియా భట్. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ చరణ్ లు హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ లో కూడా నటించిన అలియా, అటు బాలీవుడ్ లో చేస్తున్న సినిమా గంగూభాయ్ కతియావాడి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ తీస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీలు ముఖ్య పాత్రలు చేసిన ఈ సినిమాలో టైటిల్ రోల్ లో నటిస్తున్నారు అలియా. కొన్నేళ్ల క్రితం ముంబై లేడీ గ్యాంగ్ స్టర్ గా పేరుగాంచిన గంగూభాయ్ జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తుండగా హుస్సేన్ జాడి రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై నవల ఆధారంగా దీనిని తీశారు. ఇక ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయి అందరినీ ఎంతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ట్రైలర్ ఫస్ట్ లో వచ్చే సీన్ తో పాటు మధ్యలో పలు ప్రధాన సీన్స్ లో అలియా పలికిన డైలాగ్స్, కనబరిచిన యాక్టింగ్ నిజంగా ఎంతో బాగున్నాయి. అదిరిపోయే విజువల్స్, తో పాటు ట్రైలర్ లో బీజీఎమ్ కూడా ఎంతో బాగుంది.

ముఖ్యంగా తన మార్క్ ని సంజయ్ లీల భన్సాలీ సినిమాలో బాగా చూపించినట్లు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోందని పలువురు ప్రేక్షకులు అంటున్నారు. అలానే అలియా యాక్టింగ్ పరంగా గత సినిమాలతో పోలిస్తే ఇందులో మరింతగా అదరగొట్టినట్లు తెలుస్తోందని, చూడబోతే తప్పకుండా గంగూభాయ్ తో తమ హీరోయిన్ అలియా భట్ పెద్ద సక్సెస్ అందుకోవడం ఖాయం అని పలువురు ఆమె అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ట్రైలర్ తో ఆకట్టుకున్న అలియా భట్, గంగూభాయ్ కతియావాడి, ఈనెల 25న రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: