భవనం విషయంలో సోను సూద్ పెట్టిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో... ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు సోను. అక్కడైనా తనకు అనుకూలంగా తీర్పు వస్తుందేమోనని ఆశగా ఉన్నారు ఈ  రియల్ హీరో. ముంబైలోని జుహు ప్రాంతంలో నటుడు సోనూసూద్‌కు శక్తి సాగర్‌ అనే పేరుతో ఆరంతస్తుల భవనం ఉంది. అయితే ఈ నిర్మాణం చట్ట విరుద్ధంగా ఉందని దీనిపై గ‌తేడాది అక్టోబ‌ర్‌ 20న సోనూసూద్‌కి బీఎంసీ నోటీసులు అందించిన విషయం తెలిసిందే.. కాగా బీఎంసీని స‌వాల్ చేస్తూ కోర్టును ఆశ్ర‌యించారు సోను. అయితే దాన్ని డిసెంబ‌ర్‌లో దిగువ కోర్టు కొట్టివేయ‌డంతో సోనూ నెక్స్ట్ స్టెప్ తీసుకొని హైకోర్టును ఆశ్ర‌యించారు. కానీ అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది.

ఈ విషయంపై గురువారం విచారించిన హైకోర్టు అన్ని వివరాలు పరిశీలించి సోనూసూద్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ కొట్టి వేసింది. సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన స్టేను కొనసాగిస్తూ సింగిల్‌ బెంచ్‌ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అంతేకాదు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ ‌(బీఎంసీ)  నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు సోను సూద్. అక్రమాలకు అలవాటు పడ్డారని, అధిక లాభాలు పొందడానికి చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారని సోనూసూద్ పై ఆరోపణలు చేసింది బి ఎం సి. అయితే ఈ ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని తనపై చర్యలు తీసుకోకుండా, భవనాన్ని కూల్చకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని హైకోర్టులో పిటిషన్‌ వేసినా, ఇక్కడ చుక్కెదురు కావడంతో.... ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు నటుడు సోనుసూద్. కాగా ఈ విషయంపై పలు రకాల చర్చలు కొనసాగుతున్నాయి.

గతంలో నటి కంగనా రనౌత్ కి కూడా ఇలాంటి సమస్య ఎదురైందని చెబుతున్నారు. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణం చేశారని కంగనా రనౌత్ కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూల్చివేశారు. అయితే దీని వెనుక వేరే కారణం ఉందని....సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో శివసేన ప్రభుత్వానికి వ్యతిరేకంగా  ఘాటు వ్యాఖ్యలు చేసినందుకే తనపై ఈ రూపంలో కక్ష తీర్చుకున్నారు అని కంగనా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అదే తరహాలో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ గొప్ప గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోనూసూద్ ని కావాలనే టార్గెట్ చేసి ఇలా సాధిస్తున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఏది ఏమైనా ఈ సమస్య నుండి సుప్రీం కోర్ట్ సోను కు రిలీఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: