చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా.. కొన్నింటిని దారి మళ్లించారు. రేణిగుంట-గుంతకల్లు, గుంతకల్లు-రేణిగుంట మధ్య నడిచే ప్యాసింజర్.. కడప-వైజాగ్, వైజాగ్-కడప, తిరుమల ఎక్స్ ప్రెస్, ఔరంగాబాద్-రేణిగుంట, చెన్నై-లోకమాన్య తిలక్, చెన్నై-అహ్మదాబాద్, మధురై-లోకమాన్యతిలక్ రైళ్లు రద్దు చేశారు. వెంకటాద్రి, రాయలసీమ, ముంబై, గోవా, హజ్రత్ నిజాముద్దీన్ రైళ్లను దారి మళ్లీంచారు.

అంతేకాదు తిరుపతి-చెన్నై సెంట్రల్ రైలు, గుంతకల్లు-తిరుపతి రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ.. కడప-విశాఖ తిరుమల ఎక్స్ ప్రెస్ ను తిరుపతి-కడప మధ్య, ఔరంగాబాద్-రేణిగుంట రైలను గుంతకల్లు-రేణిగుంట మధ్య రద్దు చేసింది. అలాగే తిరుపతి-నిజామాబాద్ రైలును పాకాల, ధర్మవరం, గుత్తి మీదుగా మళ్లించింది.

ఇక కడప జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. చెయ్యేరు నదిలో వరద తగ్గుముఖం పట్టగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కడప జిల్లా వ్యాప్తంగా నేడు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

మరోవైపు కడపలో పర్యటించిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. కడప బస్టాండ్, గ్యారేజ్ ను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 1800 ఆర్టీసీ సర్వీసులను రద్దు చేశామన్న ఆయన.. కడప, రాజంపేట మీదుగా తిరుపతికి బస్సు సర్వీసులన రద్దు చేసినట్టు ప్రకటించారు. రాజంపేట వరదలో ఆర్టీసీ బస్సులో ముగ్గురు మృతి చెందడం బాధాకరమని.. బస్సులో చనిపోయిన కండక్టర్ కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇస్తామన్నారు.

మరోవైపు కడప జిల్లాలోని గండికోట జలాశయం పూర్తిగా నిండింది. దీంతో లక్షా 50వేల క్యూసెక్కుల నీటిని మైలవరానికి వదులుతున్నారు. ఇక మైలవరం నుంచి పెన్నానదికి 11గేట్లు ఎత్తి లక్షా 50వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పెన్నా, కుందూనది పరివాహక ప్రాంతాలైన జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, చాపాడు, ఖాజీపేట, చెన్నూరు మండలాలకు వరద ముప్పు పొంచి ఉంది. దీంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: