కడప జిల్లాలో తొందరలోనే స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభం అవబోతోందని ఒకటే ఊదరమొదలైంది.  జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్ళపల్లెలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటవుతోందని గడచిన మూడున్నరేళ్ళుగా వార్తలు వినిపస్తునే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి శంకుస్ధాపన కూడా చేశారు. అయితే ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఇదంతా ఎందుకంటే తాజాగా స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) రు. 23985 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్త మళ్ళీ మొదలైంది.





ఇందులో రు. 8800 కోట్లతో  జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సున్నపురాళ్ళపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటవుతున్నదని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడతలో రు. 3300 కోట్లతో 10 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో మొదటి యూనిట్  ఏర్పాటవుతుందట. తర్వాత రెండో దశలో 20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో రు. 5500 కోట్లతో రెండోయూనిట్ ఏర్పాటవుతుందట. మొత్తంమీద రు. 8800 కోట్లతో ఏడాదికి 30 లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ఫ్యాక్టరీ ఏర్పాటవబోతోందనేది సారంశం.





సోమవారం జరిగిన సమావేశంలో వీలైనంత తొందరలో ప్లాంట్ పనులు మొదలయ్యేట్లు చూడాలని జగన్ ఆదేశించారట. ఎస్ఐపీబీ అనేది ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్ధే. మరి జేఎస్ డబ్ల్యూ సంస్ధతో టైఅప్ చేయించి స్టీల్ ఫ్యాక్టరీ పనులను ఇదివరకు మొదలయ్యేట్లు జగన్ ఎందుకని చేయలేకపోయారు ? ప్రతిపక్షంలో ఉన్నపుడు తాను అధికారంలోకి వస్తే మూడేళ్ళల్లో ఫ్యాక్టరీని ప్రారంభిస్తానని ప్రకటించారు.  అయితే మాట నిలుపుకోవటంలో ఫెయిలయ్యారు.





ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకపోతే కనీసం ప్రైవేటురంగంలో అయినా వెంటనే ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిన జగన్ ఆపని చేయలేదు. ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల కనీసం 20 వేలమందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. రాయలసీమ మొత్తానికి ఎంతో కీలకమైన స్టీల్ ఫ్యాక్టరీ అదికూడా సొంతజిల్లాలో ఏర్పాటుచేయటంలో జగన్ ఎందుకని ఉదాసీనత చూపారో అర్ధంకావటంలేదు. ఇప్పటికైనా ఏదో తీర్మానం చేశాం, ఆదేశాలిచ్చామన్నట్లుగా కాకుండా ఫ్యాక్టరీ ఏర్పాటు కార్యాచరణలోకి వస్తేనే జనాలు నమ్ముతారని జగన్ గ్రహించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: