వివిధ పార్టీల్లో ఉన్న తెలుగుదేశంపార్టీ మాజీలపై ఘర్ వాపసీ విషయంలో ఒత్తిళ్ళు పెరుగుతున్నాయి. ఖమ్మం బహిరంగసభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతు తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం రావాలంటే తమ్ముళ్ళందరు తిరిగి టీడీపీలోకి వచ్చేయాలని పిలుపిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై వివిధ పార్టీల్లో ఉన్న తమ్ముళ్ళలో బాగా చర్చలు మొదలయ్యాయి. క్యాడర్ ఏమో తిరిగి టీడీపీలోకి వెళ్ళిపోదామని తమ్ముళ్ళపై ఒత్తిళ్ళు మొదలుపెట్టారు.




అయితే తమ్ముళ్ళేమో టీడీపీలోకి వెళ్ళి చేసేదేముంటుంది ? అని ఆలోచిస్తున్నారు. తెలంగాణాలో టీడీపీ నిర్మాణం దాదాపు శిధిలమైపోయిన  విషయం అందరికీ తెలిసిందే. నేతలంతా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లోకి వెళ్ళిపోయారు. దాంతో క్యాడర్ కూడా చెల్లాచెదురైపోయింది. ఓటుకునోటు కేసులో ఇరుక్కుని అరెస్టు భయంతో హైదరాబాద్ నుండి విజయవాడకు పారిపోవటమే పార్టీకి శాపమైపోయింది.





అధినేతే కేసీయార్ దెబ్బకు భయపడి రాష్ట్రం నుండి పారిపోతే ఇక తమ్ముళ్ళు మాత్రం పార్టీలోనే ఎందుకుంటారు ? అందుకనే తమ్ముళ్ళు ఎవరిదారి వాళ్ళు చూసుకున్నారు. మళ్ళీ రేపు ఏదైనా సమస్య వస్తే పారిపోకుండా గట్టిగా నిలబడుతారా అని చంద్రబాబు వైఖరిపై నేతల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో భరోసా లేకపోవటంతోనే చంద్రబాబు ఘర్ వాపసీ పిలుపుపై తమ్ముళ్ళలో మిశ్రమ స్పందన కనబడుతోంది. అయితే ఇదే సమయంలో మరో ఆలోచన ఏముందంటే టీడీపీ నుండి బీఆర్ఎస్ లో చేరిన వాళ్ళల్లో అత్యధికులకు ఏమాత్రం విలువలేకుండా పోయింది.




ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ లో మండవ వెంకటేశ్వరరావులను చాలామంది ఉదాహరణలుగా చూపిస్తున్నారు. బీఆర్ఎస్ లో విలువ లేనపుడు ఇంకా ఎందుకు కంటిన్యు అవ్వాలని కొందరు తమ్ముళ్ళు తుమ్మల, మండవలను ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుపై నమ్మకం లేకే చాలామంది మాజీ మంత్రులు టీడీపీలోకి వెళ్ళటానికి వెనకాడుతున్నట్లు సమాచారం. కొద్దిరోజులు పోతే ఘర్ వాపసీపై మరింత క్లారిటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు చాలామంది తమ్ముళ్ళలోని ఆలోచనలు బయటపడతాయి. ఈలోగా చంద్రబాబు గనుక తమ్ముళ్ళల్లో ధైర్యం నింపగలిగితే ప్రక్రియకు ఊపొచ్చినా రావచ్చె చెప్పలేం. 



మరింత సమాచారం తెలుసుకోండి: