నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా మారింది. వరుస ఓటములతో ఢీలా పడిన కారు పార్టీ.. సాగర్ లో సత్తా చాటాలని భావిస్తోంది. అయితే నాగార్జున సాగర్ లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తున్న అధికార పార్టీకి ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది.
   
            ఈనెల 21  పిఏపల్లి మండలం అంగడి పెట స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వస్తున్న ఆటోను ట్రక్క్ ఢీ కొట్టడంతో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఏడుగురు కూలీలు స్పాట్ లోనే చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. మరికొందరు తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతున్నారు. చనిపోయిన వారంతా దేవరకొండ మండలం చింతబాయికి చెందిన నిరుపేదలు. అందరూ యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే. నాగార్జున సాగర్ నియోజరవర్గంలోని పెద్దవూరకు వ్యవసాయ కూలీ పనికి వెళ్లి.. సొంతూరుకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కూలీల కుటుంబాలకు సర్కార్ ప్రకటించిన పరిహారం వివాదాస్పదమవుతోంది.

         మృతుల  కుటుంబాలకు  25 లక్షల పరిహారం ప్రకటించాలని స్థానికులు, బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే హాస్పిటల్ లో బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి జగదీశ్ రెడ్డి.. కేవలం 3 లక్షల పరిహారం ప్రకటించి వెళ్లిపోయారు మంత్రి ప్రకటనపై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. కూలీ పనికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పేద కుటుంబాలకు పరిహారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో గతంలో రోడ్డు ప్రమాదాలు  జరిగినప్పుడు 25 లక్షల పరిహారం ప్రకటించిన సందర్భాలున్నాయి. ఇక్కడ పేద కూలీలు చనిపోయినా.. ప్రభుత్వం కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తుందనే విమర్శలు అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. మెదక్ జిల్లాలో పరిహారం ఒకలా, నల్గొండ జిల్లాలో మరోలా ఉంటుందా అన్న కొందరు మండిపడుతున్నారు.

                      బాధిత కుటుంబాలకు పరిహారం విషయంలో సర్కార్ తీరుకు నిరసనగా యాదవసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. దీని ప్రభావం  నాగార్జున సాగర్ కు త్వరలో జరగనున్న ఉప ఎన్నికపై ఉంటుందని చెబుతున్నారు. సాగర్ నియోజకవర్గంలో దాదాపు 50 వేల మంది యాదవ ఓటర్లున్నారు. ప్రభుత్వం పరిహారం పెంచకపోతే.. యాదవులంతా అధికార పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. విపక్షాలు కూడా  ఈ అంశాన్ని ప్రచారంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో నాగార్జున సాగర్ టీఆర్ఎస్ నేతలు టెన్షన్ పడుతున్నారు. పార్టీ  విజయావకాశాలపై ఇది  తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారం విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని, లేదంటే పార్టీకి ఉప ఎన్నికలో గండమేనని చెబుతున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం పెంచాలని పార్టీ ముఖ్య నేతలను కోరుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: