వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పటికే పలు కీలక నేతలు, శ్రేణులు పార్టీకి గుడ్ బై చెపుతోన్న నేప‌థ్యంలో తాజాగా ముగ్గురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో మరో మలుపు తిరిగింది. ఇద్దరి రాజీనామాలు చాలా రోజుల క్రితమే మండలి చైర్మన్‌కి సమర్పించినా ఇప్పటివరకు ఆమోదించలేదు. ఈ జాబితాలో పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, మండలి వైస్ చైర్మన్ జకియా ఖానం కూడా ఉన్నారు. ముఖ్యంగా జయమంగళ వెంకటరమణ తన రాజీనామా ఆమోదించలేదని కోర్టు తలుపు తట్టగా, కోర్టు ఆలస్యం చేస్తున్నందుకు మండలి చైర్మన్‌పై రూ. 10 వేల ఫైన్ కూడా విధించింది. అయినప్పటికీ చైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.


మర్రి రాజశేఖర్ కుటుంబం ఎప్పటి నుంచో కాంగ్రెస్‌లో బలంగా ఉంది. ఆ తర్వాత జగన్ వెంట నడిచి వైసీపీలో చేరినా, అక్కడ తీవ్ర అవమానాలకు గురయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విడదల రజనీ కోసం తాను బలయ్యాడన్న భావనతో రాజశేఖర్ వైసీపీని విడిచి బయటకు వచ్చారు. బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు బల్లి కళ్యాణచక్రవర్తి మళ్లీ తన సొంత గూటి అయిన టీడీపీలోకి చేరడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కర్రి పద్మశ్రీ కూడా వైసీపీలో కొనసాగలేకపోయారు. ఇదే సమయంలో పోతుల సునీత ఇటీవల బీజేపీలో చేరగా, జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. మండలి చైర్మన్ వైసీపీ నేత కావడంతో రాజీనామా ఆమోదాలపై రాజకీయ జోక్యం ఉందన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. జగన్ చెప్పినట్లుగానే చైర్మన్ వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.


ఎన్నికలకు ముందు ఫిరాయింపులపై విచారణ జరపకుండా, ఒక్క రాత్రికే కొంతమంది ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసిన సందర్భాలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు రాజీనామాలు చేసినా ఆమోదించకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద, రాజీనామా ఇచ్చినా ఆమోదం లభించకపోవడం, ఎవరెవరు ఏ పార్టీలో చేరతారన్న అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదంతా వైసీపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల ముందు ఈ పరిణామాలు ఇంకా ఏ విధంగా మలుపు తిరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: