
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ తన జీవితంలో మరో కీలక దశకు అడుగుపెట్టనున్నాడు. ఉత్తరప్రదేశ్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగం చేపట్టనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అలీగఢ్‌కు చెందిన రింకూ, చాలా చిన్న వయస్సులోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. తన తండ్రి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆ బాధ్యతలో భాగం పంచుకోవాలనే ఉద్దేశంతో రింకూ చిన్న చిన్న పనులు చేశాడు. ఒక దశలో స్వీపర్‌గా పనిచేసేందుకు కూడా వెనకాడలేదన్న వార్తలు వెలుగుచూశాయి.
అయితే, ఈ కష్టాలన్నింటిని ఎదుర్కొంటూ తన లక్ష్యాన్ని కన్నాడు. టీమిండియా క్రికెటర్‌గా ఎదగాలన్న కలను పట్టుదలతో కొనసాగించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ తరఫున విశేషంగా రాణించిన రింకూ.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. తొలుత అవకాశాలు రాకపోయినా.. తర్వాత బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. ఈ ప్రదర్శనతోనే 2023లో ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టులో ఎంపికయ్యాడు. అప్పటి నుంచి టీ20లలో 33 మ్యాచ్‌లు ఆడి 546 పరుగులు చేశాడు. వన్డేల్లో రెండు మ్యాచుల్లో 55 పరుగులు చేశాడు.
అతని ప్రతిభను గుర్తించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ, ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రూ. 13 కోట్లకు రిటైన్ చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 58 మ్యాచుల్లో 1099 పరుగులు చేశాడు. ఇప్పుడు రింకూ సింగ్‌కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సత్కారం అందించేందుకు సిద్ధమైంది. ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ - 2022 పథకం కింద, జిల్లా ప్రాథమిక విద్యా అధికారి (BSA)గా నియమించనున్నట్లు సమాచారం. అయితే రింకూ తొమ్మిదో తరగతికి ముందే స్కూల్‌ను వదిలేశాడని సమాచారముంది, కానీ దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక వ్యక్తిగత జీవితంలోనూ రింకూ కొత్త అధ్యాయానికి సిద్ధమయ్యాడు. లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్‌తో మూడు సంవత్సరాల ప్రేమ అనంతరం, ఇటీవల జూన్ 8న నిశ్చితార్థం చేసుకున్నాడు. వివాహం ఈ ఏడాది నవంబర్ లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది. ఒక స్వీపర్ ఉద్యోగం చేసేందుకు సిద్ధమైన యువకుడు.. టీమిండియా ఆటగాడిగా ఎదిగి ప్రభుత్వ ఉద్యోగం, భారీ ఐపీఎల్ రిటైన్‌తో భవిష్యత్తు ఇది.