( స్పోర్ట్స్ - ఇండియా హెరాల్డ్ ) . . .

దాయాది దేశాలు అయిన ఇండియా, పాక్ క్రికెట్ మ్యాచ్ కు టిక్కెట్లు ఎక్కడైనా బ్లాక్ లో అమ్ముతారు. ఈ రెండు దేశాల మ‌ధ్య క్రికెట్ మ్యాచ్ జ‌రుగుతుంది అంటే చాలు బుకింగ్స్ ఓపెన్ చేసిన క్షణాల్లో ఫుల్ అయిపోతాయి. ఉప ఖండంలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ రెండు జ‌ట్లు ఎక్క‌డ త‌ల‌ప‌డుతున్నా క్ష‌ణాల్లో టిక్కెట్లు అయిపోతాయి. బ్లాక్ లో అయితే సామాన్యులు మాత్ర‌మే కాదు మిడిల్ రేంజ్ సెల‌బ్రిటీలు సైతం కొన‌లేని ప‌రిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయిపోయింది. ఈ రెండు జ‌ట్లు ఓ కీల‌క టోర్న‌మెంట్‌లో త‌ల‌ప‌డుతున్నా అసలు టిక్కెట్లు కొనేవారు లేకుండా పోయారు. ఆసియా కప్ లో ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కు టికెట్ అమ్మకాలు దారుణంగా ఉన్నాయి. పైగా మ్యాచ్ సండే జ‌రిగింది. అందులోనూ దుబాయ్ లో కావ‌డంతో అక్క‌డ మ‌న‌వాళ్లు చాలా మంది ఉంటారు. ఇండియా నుంచి దుబాయ్ చాలా సింపుల్‌గా వెళ్లి రావ‌చ్చు.


అయినా కూడా ఆదివారం మ్యాచ్ చూస్తే సగం స్టేడియంపైనే ఖాళీగా ద‌ర్శ‌నం ఇచ్చింది. ఈ మ్యాచ్ కు భారీగా డిమాండ్ ఉంటుంద‌ని భావించి భారీ రేట్లు పెట్టారు. సేల్స్ అసలు లేకపోవడంతో టిక్కెట్ ధరలు తగ్గించారు. అయినా డిమాండ్ లేదు. ముందుగా స్టాండర్డ్ టికెట్ రేట్‌ను మొదట 475 దిర్హమ్స్ గా నిర్ణయించారు. అమ్మకాలు లేక దీనిని 350 దిర్హమ్స్ కు తగ్గించారు. ఇక ప్రీమియం టిక్కెట్ల సేల్స్ దాదాపుగా లేవు. మ్యాచ్ కు బజ్ లేకపోవడంతో వీఐపీలు ఎవరూ కూడా ఇటు వైపే రాలేదు. ప్రీమియం సీట్ల ధరలు అత్యంత ఖరీదైనవిగా ఉండటంతో ఇతర అభిమానులు ఆసక్తి చూపించలేదు.


ఈ రెండు దేశాల మ‌ధ్య వివాదాలు ఉన్న‌ప్పుడు మ్యాచ్‌కు ఎక్కువ హైప్ వ‌స్తుంది. అయితే ఈ సారి ఆపరేషన్ సింధూరం వ్యవహారం ఉన్నా హైప్ రాలేదు. ఇరు జట్లలో స్టార్ ప్లేయర్లు లేకపోవడం కూడా ఈ మ్యాచ్‌కు అంత‌గా బ‌జ్ రాక‌పోవ‌డానికి మ‌రో కార‌ణం. మ‌న జ‌ట్టు నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు రిటైర్ కావడం కూడా టికెట్ అమ్మకాలపై ప్రభావం చూపింది. ఈసారి ఆసియా కప్ నిర్వాహకులు ప్యాకేజ్ టికెట్ విధానాన్ని తీసుకు రావ‌డంతో  దీని వల్ల కూడా టిక్కెట్లు కొనేవాళ్లు తగ్గిపోయారు.


ఇక మ్యాచ్ కూడా పూర్తి ఏక‌ప‌క్షంగా .. చ‌ప్ప‌గా సాగింది. కారణం ఏదైనా.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. గతంలో వచ్చే హైప్‌లో పది శాతం కూడా ఆదివారం మ్యాచ్ కు రాలేదు ... చాలా మంది టీవీల్లో కూడా మ్యాచ్ చూసేందుకు ఆస‌క్తి చూప‌లేదు. దీనికి తోడు ఇది గ్రూప్ మ్యాచ్ కావ‌డం.. సూప‌ర్ 4 ద‌శ‌లో రెండు జ‌ట్లు మ‌రోసారి త‌ల‌ప‌డే ఛాన్స్ ఉండ‌డంతో ఈ మ్యాచ్ లైట్ తీస్కొన్నారు. చివ‌ర్లో ష‌హీన్ షా ఆఫ్రిది సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ‌క‌పోతే ఆ స్కోర్ కూడా పాకిస్తాన్‌కు ఉండేదే కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: