కొందరి జీవితాలు.. వారి వరకే పరిమితం అవుతాయి. మరికొందరి జీవితాలు.. వారు-వారి కుటుంబాల వరకు మాత్రమే పరిమితంగా ఉంటాయి. కానీ కొందరు మాత్రమే.. ఈ సమాజంలో ఓ అధ్యాయంగా మారతారు. మరెందరికో స్ఫూర్తి నింపుతారు. అలాంటి వారు చాలా చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. ఇక, ఇలాంటి వారిలో ఒకరుగా ముందు వరుసలో ఉన్నారు.. సరిపల్లి శ్రీజారెడ్డి. కొందరు జెండా పట్టుకుని రోడ్డెక్కితే.. మరికొందరు.. జెండా మోసేవారిని తయారు చేస్తారు. ఇలా.. తనదైన ప్రపంచం నుంచే ఈ సమాజానికి సేవ చేస్తున్నారు శ్రీజారెడ్డి. ఆటిజం (బుద్ధి మాంద్యం)తో బాధపడే చిన్నారుల పాలిట కల్పతరువుగా నిలుస్తున్నారు సరిపల్లి శ్రీజారెడ్డి. సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఎవరి సమస్యలు వారికి ఎక్కువ. కానీ.. పక్కవారి సమస్యను కూడా తనదిగా భావించేవారు ఎందుకు ఉన్నారు? అనేది చూస్తే.. వేళ్లపై లెక్కించగలిగేంత మందే ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా.. తన ఇంట్లో వెలుగు చూసిన.. ఆటిజం సమస్యపై తాను పోరాడి.. సాదించిన విజయ ఫలాలను ఈ సమాజానికి కూడా అందిస్తున్నారు శ్రీజారెడ్డి.
తన కుమారుడు ఆటిజం భారిన పడిబాధపడుతున్న సమయంలో ఈ సమస్యకు పరిష్కారం కోసం అహరహం శ్రమించి.. పరిష్కారం కనుకొన్నారు. అయితే.. తన సమస్యలాంటి సమస్యతో ఈ సమాజంలో ఎందరో తల్లులు తల్లడిల్లుతున్నారని తెలుసుకున్న శ్రీజారెడ్డి.. తనే క్లినిక్‌ను ఏర్పాటు చేసి.. అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకున్నారు. అదే పినాకిల్ బ్లూమ్స్. దీనిద్వారా అత్యంత తక్కువ ఖర్చుతో ఆటిజంతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారులకు దారిచూపించారు. ఈ సేవే శ్రీజారెడ్డిని సమాజంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పినాకిల్ బ్లూమ్స్ సంస్థల్లో 1500 మంది చిన్నారులకు అనేక థెరపీలు ఇస్తున్నారు. ఈ సంస్థ ద్వారా చిన్నారుల్లో వచ్చిన గుణాత్మక మార్పులకు ఆ పిల్లల తల్లిదండ్రుల మాటలే చెపుతాయి. సమాజంలో బతకడమే కాదు.. సమాజంతో పెనవేసుకుని జీవించడం ఎలాగో నేర్పిస్తున్నారు శ్రీజారెడ్డి. అందుకే .. ఆమె నేటి చరిత్రలో ఒక పుటగా కాదు.. ఒక అధ్యాయంగా మిగిలారు.. మరెంతో మందికి సేవ చేస్తూ.. సమాజంలో తనకంటూ.. ప్రత్యేక స్థానం నిలబెట్టుకున్నారు.