
వాస్తవానికి, కృష్ణన్ ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో పాల్గొంటున్నారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం వరకు అక్కడే ఉండాలి. కానీ దేశ భద్రతా కారణాల దృష్ట్యా, ఆయన గురువారమే హడావిడిగా తన IAF యూనిట్‌కు బయలుదేరి వెళ్తున్నారు. "ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత వాయు సేన నన్ను తిరిగి పిలిచింది" అని గ్రూప్ కెప్టెన్ కృష్ణన్ స్వయంగా 'ది ప్రింట్'కు ధృవీకరించారు.
• అసలు అజిత్ కృష్ణన్ ఎవరు?
భారత అంతరిక్ష రంగంలో చరిత్రాత్మకమైన గగన్‌యాన్ మిషన్ కోసం భారత వాయు సేన నుంచి ఎంపికైన నలుగురు అధికారుల్లో ఈయన ఒకరు. ఈ మిషన్ 2027లో ప్రయోగించనుంది. ఆయన అత్యంత అనుభవజ్ఞుడైన పైలట్, అలాగే శిక్షకుడు కూడా. 2003లో IAFలో చేరినప్పటి నుంచి, సు-30 MKI, MiG-21, MiG-29, Jaguar, Dornier, An-32 వంటి వివిధ రకాల విమానాల్లో దాదాపు 2,900 గంటల పాటు విమానాలు నడిపిన అపార అనుభవం ఆయన సొంతం.
ఇదిలా ఉండగా, గగన్‌యాన్ మిషన్ కోసం ఎంపికైన మరో ఇద్దరు వ్యోమగాములు శుభాంషు శుక్లా, ప్రశాంత్ బి. నాయర్ ప్రస్తుతం అమెరికాలో 'ఆక్సియం-4' మిషన్ కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ మిషన్ మే 29న ప్రయోగించనుంది.
గగన్‌యాన్ మిషన్ కోసం శిక్షణ నిరంతరాయంగా కొనసాగుతోందని, మిషన్ ప్రయోగించే వరకు ఇది జరుగుతుందని కృష్ణన్ తెలిపారు. మాస్కోలో ప్రారంభ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత, కృష్ణన్ తో పాటు ఇతర వ్యోమగాములు ఇస్రోతో కలిసి బెంగళూరులో అత్యాధునిక వ్యోమగాముల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. భవిష్యత్ భారత వ్యోమగాములను అంతరిక్ష ప్రయాణాలకు సిద్ధం చేయడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశ్యం.
అజిత్ కృష్ణన్ హుటాహుటీన బయలుదేరి వెళ్తున్నా గగన్‌యాన్ కోసం ఎంపికైన మరో వ్యోమగామి అంగద్ ప్రతాప్ మాత్రం ఢిల్లీలో సదస్సు ముగిసే వరకు ఉండనున్నారు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలను మరింత పారదర్శకంగా, సామాన్య ప్రజలకు చేరువ చేయాలని అంగద్ ప్రతాప్ ఆకాంక్షించారు. "ప్రస్తుతం అంతరిక్షం రహస్యంగా అనిపిస్తోంది. అది మరింత బహిరంగంగా ఉండాలి. ప్రతి ఒక్కరికీ అంతరిక్షాన్ని అన్వేషించే అవకాశం ఉండాలి" అని ఆయన అన్నారు.
గగన్‌యాన్ మిషన్ ముఖ్య లక్ష్యం ఏంటంటే.. ముగ్గురు భారతీయ వ్యోమగాములను భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న తక్కువ భూ కక్ష్య (Low Earth Orbit) లోకి మూడు రోజుల పాటు పంపడం. ఆ తర్వాత వారిని సురక్షితంగా తిరిగి భూమికి తీసుకురావడం.