శకుంతలా దేవి... ఎలాంటి లెక్కనైనా కంప్యూటర్ కంటే వేగంగా పరిష్కరించే అద్భుతమైన టాలెంట్ ఉన్న మహిళ. అందరూ ఈమెను హ్యూమన్ కంప్యూటర్ అని పిలుస్తారు. ప్రపంచంలోనే అతి వేగంగా గణిత సమస్యలకు ఫలితాలను కనుగొనే ఈమె గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. శకుంతలా దేవి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 


 
ఈమె తండ్రి సర్కస్ కంపెనీలో పని చేసి కుటుంబాన్ని పోషించేవారు. చిన్న వయస్సులోనే అసాధారణ ప్రతిభ ఉన్న శకుంతలా దేవి పేక ముక్కలతో ట్రిక్కులు చేస్తూ కుటుంబ సభ్యులను, బంధువులను ఆశ్చర్యపరిచేవారు. ఎంతో టాలెంట్ ఉన్నా పేదరికం ఆమె చదువుకు ఆటంకంగా మారింది. నెలకు శకుంతలా దేవి తండ్రి 2 రూపాయల ఫీజు కట్టలేకపోవడంతో ఒకటవ తరగతిలోనే ఆమె చదువుకు దూరమయ్యారు. 


 
చదువుకు శకుంతలా దేవి దూరమైనా ఆమె ప్రతిభా పాటవాల గురించి దేశమంతటా తెలిసింది. గణితంలో తన ప్రావీణ్యాన్ని శకుంతలా దేవి చిన్న వయస్సులోనే అన్నామలై యూనివర్సిటీలో, యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ లో బహిరంగంగా ప్రదర్శించారు. 201 అంకెలు ఉన్న సంఖ్యకు 23వ వర్గాన్ని కేవలం 50 సెకన్లలో చెప్పి శకుంతలా దేవి అందరినీ ఆశ్చర్యపరిచారు. 


 
ఆమెను అడిగిన ప్రశ్నను కంప్యూటర్ పరిష్కరించడానికి ఒక నిమిషానికి పైగా సమయం పట్టింది. 1980లో లండన్ కంప్యూటర్ విభాగం వారు రెండు 13 అంకెల సంఖ్యలను ఇచ్చి గుణించి ఫలితం చెప్పమని అడగగా కేవలం 28 సెకన్లలో ఆమె సమాధానం చెప్పారు. నిద్రలో లేపి ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేంత ప్రతిభ ఈమె సొంతం. ఈమె రచించిన పుస్తకాలు ఎంతో ప్రాముఖ్యత పొందాయి. 2013 సంవత్సరం ఏప్రిల్ నెల 21న శకుంతలా దేవి గుండెపోటుతో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: