రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఏకంగా ప్రపంచంలోనే అత్యధిక మందిని ఆకర్షించేవి, ఆనందపరిచేవి వంటలు. ప్రతీ మనిషి రుచికరమైన వంటకాలను ఆస్వాదించాలని ఆశపడుతుంటారు. ఎంత సంపాదించినా కూడా నోటికి ఇష్టమైన ఆహారాన్ని కొంతమోతాదులో అయినా రుచి చూడకపోతే జీవితమే దండగ అంటుంటారు. ఎప్పటికప్పుడు కొంగొత్త రకాల వంటకాలు సిద్ధమవుతూనే ఉంటున్నాయి. అందుకనే వంటలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ప్రతీ ప్రముఖ ఛానెల్స్, పేపర్లు కవర్ చేస్తుంటాయి. ఇక అలాగే యూట్యూబ్‌లో కూడా వంటలకు సంబంధించిన వందలాది ఛానెల్స్ ఉన్నాయి.
ఇక తెలుగు ప్రజల్లో ‘గ్రాండ్‌పా కిచెన్’ యూట్యూబ్ ఛానెల్ బాగా పాపులర్. తెలంగాణ వాసి, వంటల తాత 73 ఏళ్ల నారాయణ రెడ్డి వండే విధానం, ఆయన వంటల తాలూకూ గుబాళింపు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులను సంపాదించి పెట్టింది. కానీ, ఆయన గత ఏడాది అక్టోబర్‌లో కన్నుమూయడం ఆయన అభిమానులకు తీరని లోటే. ఇక తమిళనాడులోనూ కూడా ఓ తాత పెరియతంబి తన వంటలతో అద్భుతం చేస్తున్నారు. ‘విలేజ్ కుకింగ్ ఛానెల్’ పేరుతో ఆయన మనవళ్లు ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్ ఇప్పుడు విశ్వవ్యాప్తంగా పాపులర్ అయింది. రెండేళ్ల కిందట ప్రారంభించిన ఈ ఛానెల్‌ను ఇప్పటికే 7 మిలియన్ల మందికి పైగా సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే... కాంగ్రెస్ పార్టీ యువరాజు 'రాహుల్ గాంధీ' ఇటీవలే తమిళనాడు పర్యటన నిమిత్తం వెళ్లినప్పుడు ఆ వంటల తాత టీమ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. అంతేకాకుండా సరదాగా వారితో కలిసి గరిట తిప్పారు కూడా. ఇక ఆ తర్వాత తయారైన మష్‌రూమ్ బిర్యానీని ఆస్వాదించి వారి భాషలోనే వారికి కితాబిచ్చారు. స్థానిక మహిళ ఒకరు రాహుల్‌కు, పెరియతంబి టీమ్‌కు మధ్య ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించారు. రాహుల్ ఆంగ్లంలో చెప్పింది వారికి తమిళంలో చెప్పి, వాళ్లు తమిళంలో మాట్లాడింది రాహుల్‌కు ఆంగ్లంలో వివరించి సంభాషణ కొనసాగించారు. ఈ క్రమంలో ఒకసారి ఆమె రాహుల్ ఇంగ్లిష్‌లో చెప్పిన మాటలను వారికి మళ్లీ అదే భాషలో చెప్పడం వీడియోలో నవ్వులు పూయిస్తుంది. తమ వంటలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని రాహుల్ గాంధీతో సుబ్రమణ్యం చెప్పాడు. తమిళనాడు మాత్రమే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలు, ఇతర దేశాలకు కూడా వెళ్లి వంటలు చేయాలనేది తమ కోరిక అని చెప్పాడు. అది విన్న రాహుల్.. అమెరికాలో తనకొక మిత్రుడు ఉన్నాడని, ఆయనకు చెప్పి షికాగోలో వంట కార్యక్రమం పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆ మిత్రుడు ఎవరో కాదు.. శ్యామ్ పిట్రోడా.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. శుక్రవారం (జనవరి 29) పోస్టు చేసిన ఈ వీడియోను గంటల వ్యవధిలోనే దాదాపు లక్షల మంది వీక్షించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి