నల్ల  ఉప్పును వాడడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఆయుర్వేదంలోనూ, సాంప్రదాయ వైద్యంలోనూ ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. నల్ల ఉప్పును 'కాలా నమక్' అని కూడా పిలుస్తారు. ఇది సాధారణ ఉప్పులా కాకుండా, ప్రత్యేకమైన సువాసన, రుచిని కలిగి ఉంటుంది. సాధారణంగా, ఇది పింక్-బూడిద రంగులో ఉంటుంది.

నల్ల ఉప్పులో సోడియం క్లోరైడ్ ఉంటుంది. అలాగే, సల్ఫర్ సమ్మేళనాలు, ఐరన్ , కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఈ సమ్మేళనాల కారణంగానే దానికి ప్రత్యేకమైన రుచి, వాసన వస్తుంది. నల్ల ఉప్పు జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. భోజనం తర్వాత ఒక గ్లాసు మజ్జిగలో చిటికెడు నల్ల ఉప్పు వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

సాధారణ ఉప్పుతో పోలిస్తే నల్ల ఉప్పులో సోడియం తక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి నల్ల ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ రసం, పుదీనా రసం, మజ్జిగ వంటి వాటిలో చిటికెడు నల్ల ఉప్పు కలుపుకుని తాగితే శరీరం చల్లబడుతుంది.

 కండరాల నొప్పులు, తిమ్మిర్లను తగ్గించడంలో నల్ల ఉప్పు సహాయపడుతుంది. దీనిలో ఉన్న ఖనిజాలు కండరాలను సడలించడానికి తోడ్పడతాయి. నల్ల ఉప్పును బాత్ సాల్ట్ గా ఉపయోగిస్తారు. ఇది చర్మంలోని మలినాలను తొలగించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే, పాదాల వాపు ఉన్నవారు గోరు వెచ్చని నీటిలో కొంచెం నల్ల ఉప్పు వేసి పాదాలను ఉంచితే ఉపశమనం లభిస్తుంది.

బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి నల్ల ఉప్పు మంచి ఎంపిక. ఇది జీవక్రియను వేగవంతం చేసి, కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. నల్ల ఉప్పుకు యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే, నల్ల ఉప్పు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ఉప్పు అయినా ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక నల్ల ఉప్పును కూడా తగిన మోతాదులో వాడడం ముఖ్యం

మరింత సమాచారం తెలుసుకోండి: