
టాలీవుడ్ నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సినీ కెరీర్‌లో లెక్కలేనన్ని విజయాలు సాధించారు. రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ బాలయ్య చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. జగన్‌ను 'సైకో' అంటూ బాలకృష్ణ చేసిన విమర్శలు మీడియాలో ప్రధానంగా చర్చనీయాంశమయ్యాయి.
సాధారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై గానీ, ముఖ్యమంత్రి జగన్‌పై గానీ ఎవరైనా విమర్శలు చేస్తే, వాటికి అత్యంత ఘాటుగా, దూకుడుగా కౌంటర్ ఇచ్చే ఫైర్‌బ్రాండ్ నాయకురాలు, ,మాజీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. తనదైన శైలిలో విమర్శకులకు దీటుగా సమాధానం చెప్పే రోజా, ఈ విషయంలో మాత్రం ఆశ్చర్యకరంగా మౌనం వహించడం పలు సందేహాలకు తావిస్తోంది. బాలకృష్ణ చేసిన ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలపై రోజా ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
దీనిపై సోషల్ మీడియా వేదికగా అనేక రకాల చర్చలు, ఊహాగానాలు మొదలయ్యాయి. బాలకృష్ణ, రోజా కలిసి గతంలో పలు విజయవంతమైన చిత్రాల్లో హీరో-హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కారణంగానే, తమ పాత సినీ అనుబంధం, స్నేహం వల్లే రోజా... బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించకుండా సైలెంట్‌గా ఉన్నారంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. రాజకీయ విమర్శలకు సిద్ధంగా ఉండే రోజా, బాలయ్య విషయంలో ఆ పాత బంధానికి గౌరవం ఇచ్చి మౌనం పాటించారని కొందరి అభిప్రాయం. మరి ఈ మౌనం వెనుక ఉన్న అసలు కారణం ఏంటనేది వేచి చూడాలి. రోజా స్పందన కోసం రాజకీయ వర్గాలు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రోజా గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.