ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల్లో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో భర్తీ చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయదల్చుకుంది జగన్‌ ప్రభుత్వం.  


ఎన్నికల హామీలతో పాటూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్... తాజాగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలపై  మరో కీలక అడుగు వేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం.. సాధారణ పరిపాలన శాఖ నేతృత్వంలో రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.  


దీనికి సంబంధించి డిసెంబర్ 1న కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయనున్నారు. అలాగే వచ్చే కేబినెట్‌ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఔట్ సోర్సింగ్‌లో దళారీ వ్యవస్థ కట్టడి చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని  ప్రభుత్వం చెబుతోంది. కార్పొరేషన్‌కు అనుబంధంగా జిల్లాస్థాయిలో విభాగాలు.. జిల్లా ఇంఛార్జ్ మంత్రి నేతృత్వం, ఎక్స్ అఫిషియోగా కలెక్టర్ ఉంటారు. 


ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారుల్ని ఆదేశించారు. అన్ని ప్రభుత్వశాఖల్లో ఒకే పనికి ఒకే రకమైన వేతనం.. అది కూడా ఆన్‌లైన్‌ పద్థతిలో జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. పోర్టల్ ద్వారా నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రణాళిక రూపకల్పన కోసం నియమించిన.. నిపుణుల కమిటీ విధి విధానాలపై ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిపుణుల కమిటీ పర్యటించనుంది. క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ కోసం అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ ఉద్యోగులతో కమిటీ సంప్రదింపులు జరపనుంది. కమిటీ కార్యాకలాపాల నిర్వాహణకు కావాల్సిన సిబ్బంది,  ఇతర అవసరాలను సమకూర్చనుంది సీఆర్డీఏ. ప్రభుత్వంతో సమన్వయం కోసం సీఆర్డీఏ అదనపు కమిషనర్ విజయ కృష్ణన్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరించనున్నారు. మొదటి సమావేశం జరిగిన ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: