నేటి సమాజంలో యువత ఫోన్ కి బానిసలైపోతున్నారు. సెల్ఫీ మోజులో పాడి వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజగా నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలం అలీసాగర్‌ ఉద్యానవనంలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ మోజు ముగ్గురు బాలికల ప్రాణం తీసింది. బాలికలు అలీ సాగర్ ప్రాజెక్టు వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోధన్‌ రాకాసిపేటకు చెందిన జుబేరా (10) ఇంటికి నిజామాబాద్‌ నుంచి మీరజ్‌ బేగం(16), హైదరాబాద్‌ నుంచి బషీరా బేగం (16) తమ కుటుంబసభ్యులతో వచ్చారు. ముగ్గురి కుటుంబాలకు చెందిన మొత్తం ఎనిమిది మంది అలీసాగర్‌ ఉద్యానవనానికి విహార యాత్రకు వెళ్లారు. అబ్దుల్ ‌తో పాటు ఈ ముగ్గురు పిల్లలు స్నానాలు చేయడానికి చెరువులోకి దిగారు. ఈ క్రమంలో సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు లోతైన ప్రదేశంలోకి జారిపోయి నీట మునిగారు. వీరిని గమనించిన కుటుంబ సభ్యులు సహాయం కోసం కేకలు వేయడంతో సమీపంలో ఉన్న బోటింగ్‌ పాయింట్‌ సభ్యుడు నగేష్‌ , చెరువులో చేపలుపడుతున్న జాలరి గంగాధర్‌ నీట మునుగుతున్న యువకుణ్ణి రక్షించగలిగారు. అప్పటికే బాలికలు నీట మునిగి మృతి చెందారు.

ఈ యువతులు ప్రమాదవశాత్తు అలీసాగర్ రిజర్వాయర్‌లో పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. సెల్ఫీ దిగుతూ ఒకరి వెంట మరొకరు నీళ్ళల్లో పడిపోయి చనిపోయినట్లుగా భావిస్తున్నారు. ఒకరిని కాపాడబోయి మరొకరు నీళ్ళల్లో పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు అలీసాగర్ పార్కు సిబ్బంది ద్వారా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. వారు గాలింపు చేపట్టి.. ముగ్గురు బాలికల మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో బాలికల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

\

మరింత సమాచారం తెలుసుకోండి: