కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్ కూడ నిరాటంకంగా జరుగుతుండడంపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు.   ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడంలో కృషి చేసిన నీటి పారుదల శాఖాదికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రస్తుతం బ్యారేజీల వద్ద పూర్తి స్థాయిలో నీరు నిలువ ఉందని, ఈ ఎండాకాలం అంతా ఈ నీటితో  రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, నింపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ రూల్స్  రూపొందించి అమలు చేయాలన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్పూర్తితోనే  రాష్టంలో చేపట్టిన ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు.
    
        మంగళవారం మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని ముఖ్యమంత్రి సందర్శించారు. ముఖ్యమంత్రి సతీమణి శోభ, మంత్రులు,ఇతర నాయకులు, అధికారులతో కలిసి గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఎదురైన అనుభవాలను నెమరు వేసున్నారు.

    ప్రాణహిత.  గోదావరి రెండు నదుల నీళ్లు కలిసిన తరువాత బ్యారెజి నిర్మాణం చేపడితే ఎక్కువ కాలం పాటు కావలసినంత నీళ్లు పంపింగ్ చేయవచ్చని వ్యూహం రూపొందించామన్నారు కేసీఆర్. వ్యాప్కోస్ తో శాస్త్రీయంగా సర్వే నిర్వహించి  మేడిగడ్డ  పాయింట్ వద్ద బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 16.17 టిఎంసీల నీటి నిలువ సామర్ద్యంతో దాదాపు 100 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడం వల్ల దాదాపు 7 నెలల పాటు నీటిని పంపింగ్ చేయవచ్చని అంచనా వేశామన్నారు.  అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందని, 99.7 మీటర్ల ఎత్తులో 16.17 టింఎంసీల నీరు నిలువ వున్నదని చెప్పారు కేసీఆర్.
 
           ప్రాజెక్టు నిర్మాణాలన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగాయన్నారు సీఎం కేసీఆర్.  నీటి పంపింగ్ కూడా  ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరుగుతున్నదని చెప్పారు. మెడిగడ్డ పాయింట్ నుండి 54 కిలోమీటర్ల వరకు ప్రాణహితలో, 42 కిలోమీటర్ల వరకు గోదావరిలో నీరు నిలువ ఉండడంతో జలకళ ఉట్టి పడుతున్నదన్నారు.  బ్యారేజీలు సముద్రాలను తలపిస్తున్నాయని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. నిజాంసాగర్ కూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీరందించడానికి ఏర్పాట్లు  జరుగుతున్నాయన్నారు కేసీఆర్.  అవసరమైతే ఎస్.ఆర్.ఎస్.పి కూడా  ఈ ప్రాజెక్టు  నుండే నీటి పంపింగ్  చేయడానికి  ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి కేసిఆర్ .  

    

మరింత సమాచారం తెలుసుకోండి: