గుంటూరు జిల్లాలోని రెండు న‌గ‌ర పంచాయ‌తీల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధిం చి అప్పుడే క‌స‌ర‌త్తు ప్రారంభ‌మైంది. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ దీనిపై దృష్టి పెట్టింది. కొత్త‌గా ఏర్పాటైన‌.. పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు  నిర్వ‌హించాల‌ని కొన్నాళ్ల కింద‌టే నిర్ణ‌యించినా.. ఈ పంచాయ‌తీల ఏర్పాటును త‌ప్పుబ‌డుతూ.. కొంద‌రు హైకోర్టులో పిటిష‌న్లు వేశారు. దీంతో ఈ ప్ర‌క్రియ ఆగిపోయింది. అయితే.. తాజాగా హైకోర్టు తీర్పు ఇవ్వ‌డంతో.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు మార్గం సుగ‌మ‌మైంది.

గుంటూరు జిల్లాలో గురజాల, దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆపాలని దాఖలైన అప్పీళ్లను ఇటీవ‌ల‌ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఆటంకాలు తొలిగిపోయాయి. ఈ మేరకు జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు చేస్తోంది. దాచేపల్లి, గురజాల నగర పంచాయతీల ఎన్నికలకు ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని, పోలింగ్‌ స్టేషన్లను గుర్తించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నుంచి ఆదేశాలు అందాయి. పల్నాడులోని గురజాల, దాచేపల్లి నగర పంచాయతీల కు తొలిసారి నగర పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి.

నడికుడి, దాచేపల్లి పంచాయతీలను కలిపి దాచేపల్లి నగర పంచాయతీగా మార్చారు. ఈ నగర పంచాయ తీలో 20 వార్డులను ఏర్పాటు చేశారు. దాచేపల్లిలో 31,685 మంది ఓటర్లు ఉన్నారు.  అదేవిధంగా గురజాల, జంగమహేశ్వరపురం గ్రామపంచాయతీలను కలిపి గురజాల నగర పంచాయతీగా మార్చారు. ఈ నగర పంచాయితీని 20 వార్డులుగా విభజించారు. ఈ పంచాయితీలో 22,603 మంది ఓటర్లు ఉన్నారు. వీటితో పాటు మూడు మునిసిపాలిటీల్లోని మూడు వార్డులకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ వార్డులకు ఎన్నికైన వారు చనిపోవటంతో  ఉపఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది.

 రేపల్లె- 16వవార్డు, మాచర్ల - 8వవార్డు, గుంటూరులో 6వ వార్డుకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే.. వార్డుల్లో జ‌రిగే ఉప‌పోరును ప‌క్క‌న పెడితే.. న‌గ‌ర పంచాయ‌తీల్లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీదే పైచేయికానుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌డంతో.. ఇక్క‌డ టీడీపీ హ‌వా ఎక్కువ‌గా ఉంది. మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు.. సార‌థ్యంలో పార్టీ పుంజుకున్న నేప‌థ్యంలో రెండేళ్ల కింద‌టి ప‌రిణామాలు పూర్తిగా మారిపోయి.. ఇప్పుడు టీడీపీకి సానుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. దీనికితోడు.. స్థానిక ఎమ్మెల్యేపై పెరిగిన వ్య‌తిరేక‌త కూడా ఇక్క‌డ టీడీపీకి క‌లిసివ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: