
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి పార్టీల మధ్య సఖ్యత, బంధాలు, అంతర్గత సంబంధాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ , జనసేన పార్టీలు కలిసి ఏర్పడిన కూటమిలో, నేతల మధ్య స్పష్టమైన ఐక్యత అవసరం ఉన్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కూటమి పార్టీల నేతలు ఒకే లక్ష్యంతో ముందుకు సాగాల్సిన సమయానికే, కొందరు నేతలు వ్యతిరేక పార్టీలతో, ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ.. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉండడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వాస్తవానికి, కూటమిలో ఐక్యత కోసం పవన్ కల్యాణ్, చంద్రబాబు చాలానే శ్రమిస్తున్నారు. అయితే వారిచ్చే సందేశాలను, పార్టీలోని కొందరు స్థానిక నేతలు పాటించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాపారాలు, కాంట్రాక్టులు లాంటి ఆర్థిక ప్రయోజనాల కోసం రాజకీయ వ్యతిరేకులను సైతం స్నేహితులుగా చూస్తున్న నేతల వ్యవహారం ఇప్పుడు కూటమిలో ఆందోళనకు దారి తీస్తోంది.
ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎంపీ పెద్దఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. కానీ ఈ వ్యాపారాలు నేరుగా తాను నిర్వహించకుండా, సబ్ కాంట్రాక్టుల రూపంలో నిర్వహిస్తారట. ఇవి తమ పార్టీ నాయకులకు కాకుండా, వైసీపీ నేతలకు లభించాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది పార్టీ పరంగా దారుణమైన పరిణామ అని టీడీపీ కేడర్ వాపోతోంది. ఇదే తరహాలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతో ఎంతో సన్నిహితంగా తిరుగుతున్నారని వార్తలు బయటపడ్డాయి. రాజకీయ విభేదాలు పక్కనబెట్టి, వ్యక్తిగత లాభాల కోసం వ్యాపార సహకారాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చేపల చెరువుల నుంచి రొయ్యల ఎగుమతుల వరకు వ్యాపారాలు చేయడంలో వీరు భాగస్వాములుగా ఉన్నారు. విశాఖపట్నం ప్రాంతంలో మాజీ ఎంపీ నిర్వహించే వ్యాపారాల్లో టీడీపీ నేతలే పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.
వైసీపీకి చెందిన మరో మాజీ ఎంపీపై వచ్చిన ఆరోపణలు, విచారణ లేకుండానే క్లోజ్ అవ్వడం వెనక కూడా కూటమి నేతల ప్రమేయం ఉన్నట్టు టాక్ ? చంద్రబాబు ఇలాంటి నేతలను ఓ కంట కనిపెట్టి వార్నింగులు ఇచ్చినా మిత్రత్వ బంధాలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఇది కేవలం కూటమి పార్టీల్లో మాత్రమే కాకుండా, ప్రజల్లోనూ చర్చనీయాంశమవుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు