ఇంధన రంగాన్ని ఆధునీకరిస్తూ దేశాన్ని చమురు దిగుమతుల బానిసత్వం నుంచి బయటపడేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఈ క్రమంలో E20 పెట్రోల్ పై జరుగుతున్న విమర్శలపై తాజాగా పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ గట్టి సమాధానాన్ని ఇచ్చింది. “ఇధనం నాశనం అవుతుందని, వాహనాల ఇంజిన్లు పాడవుతాయని” జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో, కొన్ని వాహన యూజర్ల వర్గాల్లో E20 వల్ల మైలేజ్ తగ్గిపోతుందని, వాహనాలకు హానికరమని ఓ వైపు భయాందోళనలు పెరుగుతుండగా, మంత్రిత్వ శాఖ మాత్రం స్పష్టంగా చెబుతోంది – “ఇది అపోహ మాత్రమే!” .. ఇథనాల్‌కి సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే అధిక ఆక్టేన్ సంఖ్య ఉంటుందని, దీని వలన ఇంజిన్లు సాఫీగా, శక్తివంతంగా పని చేస్తాయంటూ శాస్త్రీయ ఆధారాలతో సమాధానం ఇచ్చింది.
 

ఇది అధికారికంగా ధృవీకరించబడింది – E10 వాహనాల్లో E20 వాడితే మైలేజ్ 3–6% వరకూ తగ్గవచ్చు. అయితే E20 కి స్పెషల్‌గా రూపొందించిన వాహనాల్లో ఈ తగ్గుదల కేవలం 1–2% మాత్రమే ఉంటుందట. పైగా ఇది కూడా ఇంజిన్ ట్యూనింగ్, మరియు విభిన్న భాగాల అప్‌గ్రేడింగ్ ద్వారా సరిచేసుకోవచ్చని చెప్పింది. E20 వాడకం వల్ల మామూలు పెట్రోల్ అవసరం తక్కువవుతుంది. దీంతో దేశం ముడి చమురు దిగుమతులపై బాగా ఆదా చేసిందట. 2014–15 నుండి ఇప్పటివరకు రూ. 1.4 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసిందని కేంద్రం ప్రకటించింది. రైతుల పంటల నుంచి ఇథనాల్ తయారు చేస్తుండటంతో, రైతులకు రూ.1.2 లక్షల కోట్ల పేమెంట్లు కూడా జరిగాయని తెలిపింది. 700 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గించబడ్డాయి, అంటే పర్యావరణ పరంగా పెద్ద లాభమే!



పాత వాహనాలు E20 ని తట్టుకోలేవని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. BIS, AIS వంటి సంస్థలు ఇప్పటికే స్టాండర్డ్స్ నిర్ధారించాయని, ఆయిల్ కంపెనీలు, ఆటో కంపెనీలు ఇంధనాన్ని స్టేబిలైజ్ చేసే రసాయనాలు కలుపుతున్నాయని చెప్పింది. వాహనాల్లో గమ్మత్తైన మార్పులు అవసరమైతే, అవి తక్కువ ఖర్చుతోనే సాధ్యమని వెల్లడించింది. E20 = దేశ ప్రయోజనం + రైతు లాభం + పర్యావరణ రక్షణ ..  ఈ స్కీమ్ అమలు దేశ భద్రత, ఆర్థిక అభివృద్ధికి కీలకం అని కేంద్రం స్పష్టం చేసింది. కావున “ఇంజిన్ పాడవుతుందా?”, “మైలేజ్ తగ్గుతుందా?” అన్న భయాలకి ఇక ఫుల్ స్టాప్ వేసే సమయం ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: