- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తాజాగా “కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్ర‌య‌త్నిస్తోంది” అంటూ చేసిన వ్యాఖ్య‌లు ఏపీ  రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసాయి. ప‌వ‌న్‌ ఉద్దేశపూర్వకంగానా, లేక అన్యాపదేశంగా ఈ వ్యాఖ్య‌లు చేశారా అన్నదానిపై స్పష్టత లేకున్నా, ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహాలే ఉన్నాయన్న అనుమానాలకు తావు ఏర్పడింది. పబ్లిక్‌గా ఇదీ హెచ్చరికే అయినా, లోలోన తన పార్టీ నాయకులకు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో జనసేన నేతలను కంట్రోల్ చేసేందుకే ఈ డైలాగులు పేల్చిఉంటార‌న్న‌ది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వైసీపీకి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కూటమిలో చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదన్న‌ది నిజం. గతంలో వైసీపీ కాపు ఓట్లను చీల్చే ప్రయత్నాలు చేయగా, దాంతోనే పార్టీకి నష్టం వాటిల్లిందన్న అభిప్రాయం ఉంది. జనసేనను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల వల్ల‌ పవన్‌కు ఓటర్ల మద్దతు పెరిగిందని తేలిపోయింది. జ‌గ‌న్ మోహన్ రెడ్డి సైతం ఈ నిజాన్ని గుర్తించి, పవన్‌పై నేరుగా వ్యాఖ్యలు చేయడం మానేశారని వైసీపీ వాళ్లే చెపుతున్నారు.


అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నేరుగా వైసీపీని టార్గెట్ చేసినట్లుగా కనిపించినా, ఆ వ్యాఖ్యల వెనుక రాజ‌కీయ వ్యూహం ఉందంటున్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీ - జనసేన మధ్య కొన్ని ప్రాంతాల్లో విభేదాలు, పరస్పర విమర్శలు పెరుగుతున్నాయి. నియోజకవర్గాల్లో కార్యకర్తల మద్య ఆధిపత్య పోరులు, తామే ఎక్కువ పని చేస్తున్నామన్న కౌంట‌ర్లు చిన్నచిన్న విభేదాలకు దారితీయగా, అటు నాయకుల మధ్య కూడా చిచ్చు రగులుతోంది. జనసేన నేతలపై టీడీపీ నేతల నుంచి విమర్శలు వస్తుండగా, అదే విధంగా టీడీపీ నాయకులపై జనసేన వర్గాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాపక్షంగా పనిచేయాల్సిన సమయంలో నాయకుల మధ్య గొడవలు బయటపడటంతో, పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితిని నియంత్రించాలన్న దృక్పథంతోనే, “చిచ్చు పెట్టే ప్రయత్నాలు” అన్న డైలాగ్ వేసిన‌ట్టు అనిపిస్తోంది. ఈ వ్యాఖ్యల ద్వారా పవన్ ఒకవైపు వైసీపీపై విమర్శలు చేస్తూనే, మరోవైపు తన పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారన్నది స్పష్టమవుతోంది. కూటమిలో ఐక్యత అవసరం ఉందన్న సందేశాన్ని కూడా ఆయన ఈ మాటల ద్వారా పరోక్షంగా ఇచ్చారని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: