
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మూడు కీలక పార్టీలైన టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ లోని కొందరు నాయకులు చూపిస్తున్న వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధినాయకత్వం పిలుపునిచ్చిన కార్యక్రమాలకు ‘అకేషనల్‌గా’ హాజరై, తరువాత మళ్లీ తమ వ్యక్తిగత వ్యవహారాల్లో నిమగ్నమైపోతున్నారు. ఆ తర్వాత అసలు పార్టీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం ఫొటోలకు పోజులు ఇవ్వడానికే వీరు ఉన్నారా ? అనిపించేలా రాజకీయం చేస్తున్నారు. టిడిపి ప్రభుత్వం చేపట్టిన "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కీలక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అన్ని స్థాయి నాయకులను పిలిపించారు. నేతలందరూ ముందుగా హడావిడి చేసినా ఒకటి రెండు రోజుల తర్వాత వారిలో చాలామంది కనిపించకపోవడం పార్టీ పరంగా కలిసిరావడం లేదన్నది తేట తెల్లమైంది.
జనసేన పార్టీ లీడర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు పార్టీ నాయకులు సభలకు హాజరై, హడావుడిగా చేస్తున్నా, ఆయన గైర్హాజరైతే వీరు కూడా పూర్తిగా సైలెంట్ అయిపోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, రేషన్ వ్యవస్థలో సమస్యలు, అటవీ హక్కుల వంటి అనేక ప్రజా సమస్యలపై చర్చించమన్న పవన్ సూచనలపై ఎవ్వరూ స్పందించడం లేదు. క్షేత్రస్థాయిలో కీలక నాయకులు సైలెంట్ అయిపోవడం జనసేనకు వ్యూహాత్మకంగా సమస్యగా మారుతోంది. వైసీపీ విషయానికి వస్తే ఇటీవల చంద్రబాబు మేనిఫెస్టోను రీకాల్ చేస్తూ, ప్రజల్లోకి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అప్పుడు పెద్ద ఎత్తున నాయకులు సభకు హాజరైనా... ఆ తరవాత అందరు నాయకులు గప్‌చుప్ అయిపోయారు. తమ పార్టీ అధినాయకుడు ఉన్నప్పుడు వచ్చి హడావిడి చేయడం.. ఫోటో కోసం రావటం, వీడియోలో కనిపించటం, తరువాత తమ స్వంత పనుల్లో మునిగిపోవటం అన్నది అన్ని పార్టీల్లోనూ కామన్ అయిపోయింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు