తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల పోరు హోరాహోరీగా నడుస్తోంది. అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా సెంటిమెంటును రాజేసి మరీ రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు గా కనిపిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ టిఆర్ఎస్, ఎంఐఎం ఇలా ఎవరూ తీసిపోకుండా, అందరూ ఈ తరహా సెంటిమెంట్ రాజకీయాలకు తెర లేపడంతో గ్రేటర్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా తెలంగాణలో దూకుడుగా వెళ్తున్న బీజేపీ హవా అడ్డుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు చేయడమే కాకుండా,  ప్రజలలోను దానిపై చర్చ జరిగే విధంగా చేస్తున్నారు.




హైదరాబాదులో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బిజెపి కుట్రలకు పాల్పడుతోందని, దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. జిల్లాలో మత విద్వేషాలను రెచ్చగొట్టి, వాటిని గ్రేటర్ ఎన్నికల వరకు తీసుకురావాలన్నది బిజెపి కుట్రగా కెసిఆర్ చెబుతున్నారు. ముఖ్యంగా ప్రార్థన మందిరాలు వద్ద మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్లాన్ వేస్తున్నారని, ఇదంతా గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అంటూ కేసీఆర్ బిజెపిపై విమర్శలు చేస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి శాంతిభద్రతలను కాపాడడం ముఖ్యమని,  ఈ విషయంలో పోలీసులకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛను కల్పిస్తున్నామని, కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో శాంతిభద్రతల అంశంపై ప్రత్యేక సమీక్ష చేపట్టిన కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.



 ఇక టిఆర్ఎస్ కు చెందిన వారు బిజెపి మత విద్వేషాలకు పాల్పడి l రాజకీయంగా లాభపడాలి అనే విధంగా కుట్రలు చేస్తున్నారని, దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ వద్ద ఖచ్చితమైన సమాచారం ఉందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ వ్యవహారాలను బిజెపి నాయకులు ఖండిస్తూ,  టిఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని, ఎన్నికల ముందు కేసీఆర్ ఇదే రకమైన సెంటిమెంటు రాజేసి లబ్ది పొందాలని చూశారని, దుబ్బాక ఎన్నికల సమయంలో బిజెపి కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడంతో, ఆ ఆత్మహత్య కేంద్రంగా హైదరాబాదులో అల్లర్లకు కాల్పులకు దారి తీసే ప్రణాళికను బీజేపీ అమలు చేస్తోందని, దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ క్యాడర్ కు చెప్పారని కేటీఆర్ ప్రకటించారు. కానీ అటువంటిదేమీ జరగలేదని , ఇప్పుడు అదే తరహా ఆరోపణలు టిఆర్ఎస్ చేస్తోందని బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విధంగా బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని కెసిఆర్ హైలెట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఈ మత సెంటిమెంట్ ఎన్నికల్లో ఎంతవరకు వర్కవుట్ అవుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: