అవును ఇలాంటి వాళ్ళు చేసే అనాలోచిత పనుల వల్లే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. రాజకీయ నేతలన్నాక ప్రతి విషయంలోను క్రెడిట్ కోసమే పరితపిస్తారన్న విషయంలో సందేహం లేదు.  కానీ ఇలాంటి సమయంలో కూడా వ్యక్తిగత ప్రచారం కోసం పాకులాడుతుండటమే విచిత్రంగా ఉంది. యావత్ దేశమంతా లాక్ డౌన్ ను  గట్టిగా పాటిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు లాక్ డౌన్ ఉన్నా కేసులు పెరుగుతునే ఉన్నాయి. ఈ సమయంలో  శ్రీకాళహస్తిలో మాత్రం అధికార పార్టీనే లాక్ డౌన్ నిబంధనను ఆదివారం  ఉల్లంఘించటంతో జనాలు మండిపోతున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ నియంత్రణకు వివిధ రంగాలకు చెందిన చాలామంది దాతలు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు భారీ ఎత్తున విరాళాలు అందించారు. అదే విషయాన్ని చెప్పుకుని శ్రీకాళహస్తి ఎంఎల్ఏ బియ్యపు మధుసూధనరెడ్డి చేసిన ఓవర్ యాక్షన్ మాత్రం సర్వత్రా విమర్శల పాలవుతోంది.  దాతల ఫొటోలతో పోస్టర్లు, వినైల్ షీట్లు తయారు చేయించి ట్రాక్టరపై తగిలించాడు.

 

ట్రాక్టర్ల పై ఫొటోలను పెట్టి భారీ ఎత్తున పట్టణంలో ఊరేగింపు జరిపాడు. ఒకవైపు లాక్ డౌన్ అమల్లో ఉన్న  సమయంలోనే  ఎంఎల్ఏ తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునేందుకు నిబంధనలను ఉల్లంఘించి మరీ భారీ ఊరేగింపు జరపటం ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వానికి విరాళాలిచ్చిన వారంతా పోనీ శ్రీకాళహస్తికి చెందిన వాళ్ళా అంటే అది కూడా కాదు. విరాళాలిచ్చిన దాతలకు ఎంఎల్ఏకి ఎటువంటి సంబంధమూ లేదు. కేవలం వ్యక్తిగత ప్రచారం కోసం పాకులాడటమే విచిత్రంగా ఉంది.

 

ఎప్పుడైతే పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఎంఎల్ఏ ఊరేగింపు చేశాడో వెంటనే ప్రతిపక్షాలు గట్టిగా తగులుకున్నాయి. ఒకవైపు నిజంగా అవసరాలున్న వాళ్ళని కూడా పోలీసులు రోడ్లపైకి రాకుండా అడ్డుకుంటున్న సమయంలోనే ఎంఎల్ఏ ఊరేగేంపు జరపటం విమర్శలకు దారితీసింది. ఊరేగింపు జరిపింది ఎంఎల్ఏ అయితే ఆరోపణలు, విమర్శలు మాత్రం ప్రభుత్వానికి తగులుతోంది. అంటే అనాలోచితంగా ఇటువంటి వాళ్ళు చేసే చేష్టలకన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలా ?

 

ఇక్కడ ఎంఎల్ఏ ఒక్కడే కాదు. ఇటువంటి నేతలు చాలామంది ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. తమ వ్యక్తిగత ప్రచారం కోసం లాక్ డౌన్ ను యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. అధికార పార్టీ నేతలు కాబట్టి పోలీసులు కూడా వీళ్ళని కట్టడి చేయలేకపోతున్నారు. దాంతో వైసిపి నేతలు రెచ్చిపోతుండటంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి వాటి విషయంలో ప్రభుత్వం  గట్టిగా ఉండటం చాలా అవసరం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: