
దక్షిణ చైనాలోని షెన్‌జెన్ పరిధిలోని ఫోషాన్ నగరంలో చికున్ గున్యా వ్యాధి తీవ్రత అధికంగా ఉంది. స్థానిక ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. రోజుకి వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతుండటంతో వైద్య సదుపాయాలు చాలక పోతున్నాయని సమాచారం. దీంతో చైనా ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఫోషాన్‌లోని షుండే, నాన్‌హై జిల్లాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా శుభ్రత పాటించాలని కోరుతున్నారు. ఇప్పటివరకు నమోదైన వివరాలను పరిశీలిస్తే… జూలై 8న షుండే జిల్లాలో తొలి కేసు నమోదు అయింది. అనంతరం మూడు వారాల వ్యవధిలోనే కేసుల సంఖ్య 1,161కి చేరింది. బీజియావో, లెకాంగ్, చెన్‌కున్ పట్టణాల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరించిందని ఆరోగ్య శాఖ తెలిపింది. నాన్‌హై జిల్లాలో 16 కేసులు, చాంచెంగ్ జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయి.
ఇంతకీ ఈ చికున్ గున్యా అంటే ఏమిటి? ఇది ఒక దోమల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి. దోమలు కాటేసిన తర్వాత రెండు నుండి ఏడుగంటల వ్యవధిలో లక్షణాలు కనిపించవచ్చు. అధిక జ్వరంతో పాటు , జాయింట్లు నొప్పించడం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు ఈ వ్యాధికి ప్రదన లక్షనలు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇది ప్రమాదకరంగా మారే అవకాశముంది. చికున్ గున్యా వ్యాధి సోకినట్టు అనుమానం ఉన్న వారిని వెంటనే తగిన వైద్య సదుపాయాలకు తరలించాలని అధికారులు సూచిస్తున్నారు. అదే సమయంలో దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు ప్రజలు ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు తొలగించాలి. పాత బాటిల్స్, బకెట్లు, గరిటెల్లో నీరు నిల్వ ఉండేలా చేయకూడదు. వారం వారం శుభ్రత పనులు నిర్వహించాలని సూచిస్తున్నారు.
ఇక హాంకాంగ్ విషయానికి వస్తే.. అక్కడ 2019లో చివరిసారిగా చికున్ గున్యా కేసులు నమోదయ్యాయి. ఆ ఏడాది 11 కేసులు ఉండగా, 2018లో రెండు, 2017లో ఒకటి, 2016లో 8 కేసులు నమోదయ్యాయి. దీంతో చైనా పరిసర దేశాలూ అప్రమత్తమవుతున్నాయి. మొత్తంగా చెప్పాలంటే.. కరోనా వైరస్ వణుకులు మరిచిపోక ముందే మరో వైరస్ చైనాను పట్టిపీడిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్ వంటి పొరుగు దేశాలు కూడా అలెర్ట్ కావాల్సిన అవసరం ఉంది. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై మళ్లీ కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.