
వర్షాకాలం వచ్చిందంటే చాలు, చుండ్రు సమస్య చాలామందిని వేధిస్తుంది. తల దురద, వెంట్రుకలు రాలడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ వర్షాకాలంలో చుండ్రుకు చెక్ పెట్టడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తలపై ఫంగస్ పెరిగి చుండ్రుకు దారితీస్తుంది. కాబట్టి, తలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వారానికి కనీసం రెండు సార్లు తలస్నానం చేయడం మంచిది. తేలికపాటి షాంపూ ఉపయోగించి తలను శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత జుట్టును పూర్తిగా ఆరబెట్టడం మర్చిపోవద్దు. తడిగా ఉన్న జుట్టును ముడి వేయడం లేదా దువ్వుకోవడం వల్ల కూడా చుండ్రు పెరిగే అవకాశం ఉంది.
చుండ్రు తగ్గించడానికి ఇంట్లో మనం సులభంగా తయారు చేసుకోగలిగే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు ఉన్నాయి. నిమ్మరసం చుండ్రు నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తలకు పట్టించి, 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మెంతులు కూడా చుండ్రుకు మంచి పరిష్కారం. ఒక స్పూన్ మెంతులను, ఒక స్పూన్ ఆవాలను కలిపి పొడి చేసి, కొద్దిగా నీటితో కలిపి పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి.
కొబ్బరి నూనె, ఆముదం, ఆవాల నూనె వంటివి కలిపి రాత్రిపూట తలకు మర్దన చేసుకుని, ఉదయం కడిగేయడం వల్ల చుండ్రు తగ్గడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కలబంద గుజ్జును తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేసినా చుండ్రు తగ్గుతుంది. పుదీనా రసం కూడా చుండ్రు నివారణకు సహాయపడుతుంది. పుదీనా రసాన్ని మాడుకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల చుండ్రు సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు. పండ్లు, కూరగాయలు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం.