మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికి 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర విజయం ఇచ్చిన ఊపుతో ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. మెగాస్టార్ కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. చిరంజీవి ఇక్కడి దాకా రావడానికి చాలానే కష్ట పడ్డాడు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగాడు. ఈయన సినీ ప్రస్థానంలో ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొని ఇంతటి స్థాయికి వచ్చాడు. ఆయన కథ తెలుసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. మరి ఆయనే స్వయంగా తన కథ రాసుకోడానికి సంకల్పిస్తే. ఇంకేముంది యావత్ సినీ అభిమానులందరూ దాని కోసం ఎదురు చూస్తారు. అవును.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన 'ఆత్మకథ' రాసుకోడానికి సంకల్పించాడు. ఆత్మ‌క‌థ రాసుకోవాల‌న్న ఆలోచ‌న చిరంజీవికి ఎప్ప‌టి నుంచో ఉంది. చాలాసార్లు ఈ విష‌యాన్ని స్వయంగా బ‌య‌ట‌పెట్టారు కూడా. అయితే కరోనా వైరస్ కారణంగా అది ఇప్పుడు కార్య‌రూపంలోకి వ‌చ్చింది.

 

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి. అంతా ఇంటిప‌ట్టునే ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. సెలెబ్రెటీలందరూ ఖాళీగా ఉండటంతో ఒక్కొక్కరు ఒక్కోలా ఈ సమయాన్ని గడుపుతున్నారు. అయితే చిరంజీవి ఈ స‌మ‌యాన్ని ఆత్మ‌క‌థ రాసుకోవ‌డానికి ఉప‌యోగించుకుంటున్నారు. ఈ విష‌యాన్ని ఓ దిన పత్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు చిరు. త‌న జీవితంలో జ‌రిగిన కొన్ని ముఖ్య‌మైన సంఘ‌ట‌న‌ల్ని వీడియో రూపంలో రికార్డు చేసుకుని భ‌ద్ర‌ప‌ర‌చుకుంటున్నారట. చిరు 'ఆత్మ క‌థ' పుస్త‌కం రూపంలోనే కాదు, వీడియో రూపంలోనూ రాబోతోంద‌న్న మాట‌. ఆత్మ‌క‌థ రాసుకోవ‌డ‌మేనా, ఇంకేమైనా చేస్తున్నారా.. అని అడిగితే అప్పుడ‌ప్పుడూ వంట గ‌దిలో దూరి దోసెలు వేస్తున్నాన‌ని చెప్పాడట చిరు. కరోనా టైంలో వంట గ‌దిలో ప్రయోగాల జోలికి వెళ్లి దుబారా చేయ‌డం లేద‌ని, అవ‌స‌ర‌మైన‌వి మాత్ర‌మే వండుతున్నాన‌ని, మొక్క‌ల‌కు నీళ్లు పోయ‌డం.. వ్యాయామం చేయ‌డం.. ఇంట్లో కూర్చుని పాత సినిమాలు చూడ‌డం ఇదీ.. చిరు దిన చ‌ర్య‌గా మారిందని చెప్పుకొచ్చాడట. మరి మెగాస్టార్ తన ఆత్మకథని మనకి ఎప్పుడు అందుబాటులోకి తెస్తాడో చూడాలి. 

 

ఇదిలా ఉండగా లాక్ డౌన్ కార‌ణంగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కార్య‌క‌లాపాల‌న్నీ ఆగిపోవ‌డంతో తీవ్ర ఇబ్బందుల పాల‌వుతున్న కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి చిరంజీవి నేతృత్వంలో విరాళాల సేక‌ర‌ణ మొద‌లుపెట్ట‌డం తెలిసిన సంగ‌తే. క‌రోనా క్రైసిస్ చారిటీ పేరుతో జ‌రుగుతున్న ఈ కార్య‌క్ర‌మం కోసం చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్టు ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. చిరంజీవి పిలుపుతో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ ఈ ఛారిటీకి విరాళాలు అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: