
లింకన్ వయసు 63 సంవత్సరాలు. అయితే, ఆమె ఎక్కడ చనిపోయారు, మరణానికి కారణం ఏంటి అనే వివరాలను మాత్రం స్టూడియో వెల్లడించలేదు. హాలీవుడ్‌లో తన 45 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో, లార్ పార్క్ లింకన్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. అంతేకాదు, నటనలో తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే ఎంతో మంది యంగ్ యాక్టర్స్‌కు మెంటర్‌గా ఉంటూ, వారికి సరైన మార్గనిర్దేశం చేస్తూ ఎంతగానో అండగా నిలిచారు.
టెక్సాస్‌లోని డల్లాస్‌లో పుట్టిన లింకన్, 1987 నుంచి 1991 వరకు దుమ్మురేపిన "నాట్స్ ల్యాండింగ్" (Knots Landing) సీరియల్‌లో పోషించిన 'లిండా ఫెయిర్‌గేట్' పాత్రతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యారు. ఈ సీరియల్‌లో మిచెల్ లీ పోషించిన కరెన్ ఫెయిర్‌గేట్ పాత్రకు కోడలిగా, కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న డ్రమాటిక్ క్యారెక్టర్‌లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే, ఊహించని విధంగా సీజన్ 13లో ఆమె పాత్రను చంపేయడం అప్పట్లో ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. "నాట్స్ ల్యాండింగ్" టైమ్‌లోనే, లింకన్.. విలియం డెవాన్, కెవిన్ డాబ్సన్ (Kevin Dobson) వంటి స్టార్స్‌తో కలిసి చిన్న చిన్న పాత్రల్లోనూ మెరిశారు.
టీవీలోనే కాదు, వెండితెరపైనా లింకన్ తన మార్క్ చూపించారు. ముఖ్యంగా, 1988లో వచ్చిన కల్ట్ హారర్ సినిమా "ఫ్రైడే ది 13th పార్ట్ VII: ది న్యూ బ్లడ్" ఆమె కెరీర్‌లో మరో మైలురాయి. ఈ సినిమాలో, స్పెషల్ పవర్స్ ఉన్న 'టీనా షెపర్డ్' అనే టీనేజర్‌గా నటించి, భయంకరమైన విలన్ జాసన్‌ను నిద్రలేపే కీలక పాత్రలో అదరగొట్టారు. విశేషం ఏంటంటే, 2021లో విడుదలైన "రోజ్ బ్లడ్" అనే ఫ్యాన్ ఫిలింలో మళ్లీ అదే టీనా పాత్రలో కనిపించి అలరించారు. బహుశా ఇదే ఆమె చివరి నటన కావచ్చు.
ఆమె నటనా ప్రస్థానంలో “అవుట్‌లాస్”, “హైవే టు హెవెన్”, “బెవర్లీ హిల్స్, 90210”, “మర్డర్, షీ రోట్” వంటి పాపులర్ టీవీ షోలలో కూడా కీలక పాత్రలు పోషించారు. అలాగే, "ది ప్రిన్సెస్ అకాడమీ", "ఫ్రమ్ ది డార్క్", "ఆటమ్ రోడ్", ఆమె చివరి చిత్రం 2022లో విడుదలైన "ఘోస్ట్ పార్టీ" వంటి సినిమాల్లోనూ నటించి మెప్పించారు.
నటనకు కాస్త గ్యాప్ ఇచ్చాక, లింకన్ తన పేరుతో ఉన్న క్లాతింగ్ లైన్‌ను QVCలో అమ్మేవారు. తర్వాత సొంత ఊరు టెక్సాస్‌కు తిరిగి వచ్చి, కొత్త టాలెంట్‌ను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో 'యాక్టర్స్ ఆడిషన్ స్టూడియోస్'ను ప్రారంభించారు. వర్ధమాన నటులు, మోడల్స్ ఇండస్ట్రీలో మోసపోకుండా, తమ కెరీర్‌ను ఎలా బిల్డ్ చేసుకోవాలో వివరిస్తూ 2008లో "గెట్ స్టార్టెడ్, నాట్ స్కామ్డ్" అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఇలా నటిగా, మెంటార్‌గా, వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేసిన లార్ పార్క్ లింకన్, వినోద పరిశ్రమకు చేసిన సేవలకు ఎప్పటికీ గుర్తుండిపోతారు.