కరోనా మహమ్మారితో పోరాడ లేక సతమతమవుతున్న భారతదేశానికి సాయం అందించేందుకు ఇతర దేశాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది విదేశీయులు భారత ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేశారు. ఈ క్రమంలోనే
కెనడా దేశం కూడా ఇండియాకి ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించింది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ తో పోరాడుతున్న
భారత్ కి మద్దతుగా నిలిచేందుకు
కెనడా 10 మిలియన్ల డాలర్ల(దాదాపు రూ.74కోట్ల)ను ఇస్తుందని ప్రకటించారు.
ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ప్రధాని..
కెనడా విదేశీ వ్యవహారాల
మంత్రి మార్క్ గార్నియా భారతీయ విదేశీ వ్యవహారాల
మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు
ఫోన్ చేసి సంభాషించారని చెప్పుకొచ్చారు. ఈ సంభాషణలో అదనపు వైద్య సామాగ్రి విరాళంతో పాటు
కెనడా భారతదేశానికి ఏ విధంగా సహాయం చేయాలో చెప్పాలని జైశంకర్‌ను మార్క్ గార్నియా అడిగి తెలుసుకున్నారని జస్టిన్ ట్రూడో వెల్లడించారు.
"కెనడియన్
రెడ్ క్రాస్ ద్వారా
ఇండియన్ రెడ్ క్రాస్ కి 10 మిలియన్ల డాలర్లు ఇచ్చేందుకు మేము రెడీగా ఉన్నాము," అని
ప్రధాని తెలిపారు. తామ చేసే ఆర్థిక సహాయం స్థానికంగా పీపీఈ కిట్స్ కొనుగోలు చేసేందుకు
భారత్ కి ఉపయోగపడతాయని ఆయన అన్నారు. తమతో పాటు ఇండియాకి సహాయం చేయాలనుకున్నవారు redcross.ca సందర్శించండని.. ఓ ప్రపంచంగా, మనమందరం ఈ పోరాటంలో కలిసికట్టుగా ఉన్నాము అని ట్రూడో అన్నారు.
"భారతదేశం నుంచి వస్తున్న భయంకరమైన, విషాదకరమైన ఫోటోలు, వీడియోలు కెనడియన్లను తీవ్రంగా బాధ పెట్టాయి. స్నేహితులకి అవసరం లో అండగా ఉండాలి అని మాకు తెలుసు. వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిఒక్కరికీ మనం అండగా ఉండాలి, ఎందుకంటే మనం ఈ మహమ్మారిని ప్రతిచోటా జయించకపోతే.. ఇంకెక్కడా జయించలేము" అని
కెనడా ప్రధాని చెప్పుకొచ్చారు.
ఇకపోతే గడిచిన 24 గంటల్లో 3.60లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3,293 మంది రోగులు మృత్యువాత పడ్డారు. ఈ నేపధ్యంలో అత్యంత జాగ్రత్తలు పాటిస్తూ కరోనా నిబంధనలను అనుసరిస్తేనే ఈ మహమ్మారిని జయించగలమని ప్రభుత్వాలు చెబుతున్నాయి.