జ‌గ‌న్ కు ఉన్న పంతం అంతా ఎంపీ రామూను ఓడించాల‌ని..ఇది కాళింగుల‌తో సాధ్యం కాదు..ఎందుకంటే మిగ‌తా సామాజిక‌వ‌ర్గా ల నుంచి ఎంపీ రాముకు పెద్ద‌గా వ్య‌తిరేక‌త లేదు క‌నుక‌! అందుక‌నో ఎందుక‌నో రామూతో కాళింగులు పెద్ద‌గా విభేదం పెట్టుకోరు కానీ మ‌న‌సులో ఆయ‌న‌ను ఓడించ‌లేక‌పోయామ‌న్న బాధ అయితే వెన్నాడుతూనే ఉంది.అందుకే వచ్చే ఎన్నిక‌ల్లో కాళింగ సామాజిక‌వ‌ర్గం నుంచి ఎవ‌రు ఎంపీగా పోటీ చేసినా ఆర్థిక మ‌ద్ద‌తు అనూహ్య రీతిలో ఇచ్చేందుకు కొంద‌రు సిద్ధం అవుతున్నారు. ఇప్ప‌టికే డాక్ట‌ర్ దానేటి శ్రీ‌ధ‌ర్ ఎంపీ కావాల‌ని క‌ల‌లు కంటున్నారు.అవి నిజం అయ్యే అవ‌కాశాలు లేక‌పోయినా క‌ల అయితే ఆయ‌నకు ఉంది.ఆర్థికంగా ఉన్న‌వాడు క‌నుక ఆయ‌న‌ను మిగ‌తా కాళింగ పెద్ద‌లు ఆదుకోవాల్సిన ప‌నేలేదు. ఒక‌వేళ ఆయ‌న కాకుండా ఇంకెవ్వ‌ర‌యినా బ‌రిలో ఉంటే మాత్రం త‌ప్ప‌కుండా (దువ్వాడ శ్రీ‌ను లాంటి వ్య‌క్తులు) ఆర్థిక మూలాలు సుస్థిరం చేయాల్సిందే! ఈ క్ర‌మంలో జ‌న‌సేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ బీఎస్పీ నుంచి కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాళింగులు శ్రీ‌కాకుళం పార్ల‌మెంట్ నియో జ‌కవ‌ర్గం కు పోటీచేసే అవ‌కాశాలున్నాయి.. ప్ర‌ధాన పార్టీల నిర్ణ‌యం ఎలా ఉన్నా కూడా పోటీ చేసేందుకు ఔత్సాహికులు ఉన్నారు.గ‌తంలోనూ ఇలాంటి ప్ర‌య‌త్నాలే జ‌రిగినా కూడా ఆ రోజు ఎర్ర‌న్న విష‌య‌మై కానీ ఈ రోజు రామూ విష‌య‌మై కానీ కాళింగులు పె ద్ద‌గా పై చేయి సాధించింది లేదు అన్న‌ది తేలిపోయింది.ఈ క్ర‌మంలో కృపారాణి కానీ మ‌రొక‌రు కానీ పోటీలో ఉంటే ఏమౌతుందో చూడాలి..కానీ జిల్లాలో కాళింగుల‌కు పోటీగా వెల‌మ‌లే కాదు కాపులు కూడా ఎప్ప‌టి నుంచో ఎంపీ స్థానంపై క‌న్నేసి ఉన్నారు.



శ్రీ‌కాకుళం జిల్లాలో కాళింగుల ఐక్య‌తా వేదిక ఒక‌టి ఏర్పాటుకు స‌న్నాహాలు అవుతున్నాయి.ఈ క్ర‌మంలో అడుగులు కూడా ప‌డు తున్నాయి.ఇవ‌న్నీ రాజ‌కీయంగా బ‌లం ఇస్తాయో లేదో కానీ సామాజిక బ‌లం ఎంత‌న్న‌ది చాటేందుకు ఒక స‌న్నాహం అయితే కావొచ్చు.ఈ క్ర‌మంలో రాజ‌కీయ వేదిక‌ను వ‌చ్చే ఎన్నిక‌ల ముందే ఏర్పాటు చేసి త‌రువాత సంప్ర‌తింపుల ప్ర‌క్రియ ద్వారా వైసీపీని దార్లోకి తెచ్చుకుని ఎక్కువ కాళింగ టిక్కెట్లను పొంద‌డ‌మే కాకుండా ఎమ్మెల్సీల విష‌య‌మై కూడా కొంత బేర‌సారాలు సాగించ‌వ‌చ్చన్నది వీరి వాద‌న.



ఇటీవ‌ల సంబంధిత సామాజిక వ‌ర్గ ప్ర‌తినిధులంతా స‌మావేశం అయి పార్టీలక‌తీతంగా నేత‌లు ఏక‌మై కొన్ని విష‌యాలు చ‌ర్చించుకున్నారు.ఈ స‌మావేశానికి బీజేపీ న‌గ‌ర నాయ‌కులు కూడా వ‌చ్చారు.వాస్త‌వానికి శ్రీ‌కాకుళం జిల్లాలో బీజేపీకి ప‌ట్టు లేక‌పోయినా కూడా కొంతలో కొంత గౌర‌వం అయితే ఉంది.కేంద్రంలో న‌డుస్తున్న‌ది బీజేపీనే క‌నుక ఏమ‌యినా చెప్పాల‌న్నా,చేయాల‌న్నా వీరి ద్వారానే సంప్ర‌తింపులు చేయాల‌న్న ఆలోచ‌న కూడా ఒక‌టి ఉంది.ఈ క్ర‌మంలో జ‌గ‌న్ కూడా ఎప్ప‌టి నుంచో శ్రీ‌కాకుళం జిల్లా కాళింగుల‌కు బాగానే ప్రాధాన్యం ఇస్తున్నారు.


ఒక జెడ్పీ చైర్మ‌న్ ప‌ద‌వి కేటాయింపుతో పాటు ఎమ్మెల్సీ  ప‌ద‌వి ఇవ్వ‌డంతో పాటు స్పీక‌ర్ గా అదే సామాజిక‌వ‌ర్గంకు చెందిన వ్య‌క్తికే ఇచ్చారు.కానీ వీళ్లంతా ఇంకా అసంతృప్తిలో ఉన్నారు ఓ డిప్యూటీ సీఎం పోస్టు ఎందుకు మ‌న‌కు రాకూడ‌దు అన్న ఆలోచ‌న‌లోనో మ‌రో ప్ర‌తిపాద‌న‌లోనో ఉన్నారు. అంటే రాజ్య స‌భ సీటు మాజీ ఎంపీ కిల్లికృపారాణికి ఇస్తార‌న్న ప్ర‌తిపాద‌న ఒక‌టి రాజ‌కీయ ఊహాగానాల్లో భాగంగా వ‌చ్చింది.దీంతో అంతా కృపారాణికి రాజ్య‌స‌భ టికెట్ ఇస్తార‌ని అనుకున్నా అదేమంత సులువు కాద‌నే తెలుస్తోంది. అస‌లు ఆమెను ఏ ప‌దవులూ ఇచ్చేదే లేద‌ని చెబుతూ పార్టీలోకి తీసుకున్నార‌ని ఇప్ప‌టికీ వైసీపీ వ‌ర్గాలు చెబుతుంటాయి. అలాంట‌ప్పుడు రాజ్య స‌భ టికెట్ ఏ విధంగా ఆశిస్తారు? ఏ విధంగా ఇస్తారు అని? అయినా ఇప్ప‌టికే కాళింగ రాజ‌కీయ ప్రాబ‌ల్యం జిల్లాలో చాలానే ఉంది.ఆధిప‌త్య పోరులోన‌లిగిపోతున్న వెల‌మ‌లంతా ఏకం కావాల్సిన త‌రుణం కూడా వ‌చ్చేసింది.కానీ ఇవేవీ కాకుండా ఇంకా ప‌దువులు కావాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంలో అంత సామాజిక న్యాయం అయితే లేదు. ఇక త్వ‌ర‌లో ప్రారంభం కానున్న రాజ‌కీయ వేదిక ఎటువంటి ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా కేవ‌లం కాళింగ సంక్షేమానికే ప‌నిచేస్తుంద‌ని అనుకోవ‌డం కేవ‌లం అత్యాశే!

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి


మరింత సమాచారం తెలుసుకోండి: