నిజామాబాద్ జిల్లా గుట్కా దందా పేరు చెప్పగానే ముందుగా వినిపించేది అధికార పార్టీకి చెందిన ఒక నేత పేరు. నిజామాబాద్ జిల్లాలో నడిచిన గుట్కా దందాకు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం ఆ నేతనే అని చెప్పాలి. గుట్కా దందాకే డాన్ గా పేరు తెచ్చుకున్నాడు. అధికార పార్టీలో ఉంటూ తన గుట్కా దందాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటున్నారు. అంతేకాదు తనకున్న పలుకుబడితో నామినేటెడ్ పోస్టును సైతం తెచ్చుకున్నాడు. ఇంకేముంది ఆయనగారి గుట్కా దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. గుట్కా దందాలో వచ్చిన లాభాలతో ఓ దశలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సైతం సిద్ధమయ్యాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ నియోజక వర్గం నుంచి టిక్కెట్ తెచ్చుకోవటానికి శతవిధాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.


ఆ తర్వాత పార్టీ నుంచి ఎటువంటి కమిట్ మెంట్ వచ్చిందో తెలియదు గానీ అర్బన్ నుంచి పోటీ చేయొద్దని డిసైడ్ అయ్యారు. అంతేకాదు ప్రతిసారి జిల్లాలో గుట్కా పట్టుబడిన సందర్భంలో ఆ నేత పేరే ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు జిల్లాలో సదరు నేత పేరు గుట్కా దందాలో ఎక్కువుగా వినిపిస్తుండటంతో ఆయన బాగా కలవరానికి గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొద్ది రోజుల క్రితం ఓ భారీ గుట్కా డంప్ ను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో గుట్కా పట్టుకున్న పోలీసులకు రాష్ట్ర స్థాయి నేత నుంచి ఫోన్ లు రావడంతో కీలక సూత్రధారిని వదిలి పాత్రధారులపై కేసులు పెట్టారు. గతంలో ముడిపదార్ధాలను తీసుకు వచ్చి ఇక్కడే గుట్కా తయారు చేసిన సదరు నేత కొద్ది రోజులగా తమ రూట్ మార్చారు.


హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కు రహస్యంగా గుట్కా డంపులు తీసుకు వచ్చి జిల్లా కేంద్రంలోని మూడు నాలుగు చోట్ల గోదాముల్లో దాస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంతటికీ సరఫరా చేస్తున్నారు.ఇప్పటి వరకు పోలీసుల దాడుల్లో గుట్కాను విక్రయించే చిరు వ్యాపారులే దొరుకుతున్నారు కానీ డాన్ పేరు మాత్రం తెరపైకి రావటం లేదంటే ఎంతగా తన పలుకుబడి ఉపయోగించుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ముందస్తు సమాచారంతో పట్టుకున్న ఆయన పేరు బయటకు చెప్పకుండా అధికార పార్టీలో ఉన్న కీలక నేతలే పైరవీ చేస్తుంటారు. అధికార పార్టీ నుంచి ఆయనగారి గుట్కా దందాకు సపోర్ట్ చేస్తుండటంతో గుట్కా డాన్ ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైంది. మరి గుట్కా మాఫియాను పెంచి పోషిస్తున్న ఆ నేతకు అధికారులు ఎలా చెక్ పెడతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: