రాబోయే ఎన్నికల్లో కేసీయార్ ను గద్దె దించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాదు. రెండుపార్టీలు కలిసినా బీఆర్ఎస్ ను ఓడించటం వల్లకాదు. ఎందుకంటే తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ ఎంట్రీ ఇవ్వబోతోంది కాబట్టే. వచ్చేఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను ఒంటరిగా పోటీచేయాలని టీడీపీ డిసైడ్ చేసింది. చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయమైంది. బుధవారం ప్రతినిధుల సభ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగింది.





ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు ఎప్పుడు యాక్టివ్ అయినా వెంటనే తెలంగాణా సెంటిమెంటు రాజుకుంటోంది. సెంటిమెంటు కారణంగా మెజారిటి ఓట్లన్నీ బీఆర్ఎస్ కు అనుకూలంగా పడుతున్నాయి. 2014 ఎన్నికల్లో కానీ తర్వాత 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా ఇలాగే జరిగింది. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఈ విషయం స్పష్టంగా బయటపడింది. 150 డివిజన్లలో పోటీచేసిన టీడీపీ గెలిచింది కేవలం రెండంటే రెండు చోట్ల మాత్రమే.





ఎక్కడ టీడీపీ పోటీకి సిద్ధపడుతున్నా అక్కడి జనాల్లో మెజారిటి బీఆర్ఎస్ కు సానుకూలంగా వేస్తున్నారు. అలాంటిది ఇపుడు మళ్ళీ టీడీపీ యాక్టివ్ అవుతోంది. చరిత్రను చూసుకుంటే టీడీపీ యాక్టివ్ అవుతోందంటే కేసీయార్ హ్యాపీగా ఫీలవ్వాల్సిన విషయమే కదా. ప్రస్తుత పరిస్దితుల్లో టీడీపీ తెలంగాణాలో ఎంత పుంజుకుంటే బీఆర్ఎస్ కు అంత మంచిదనే అనుకోవాలి.





వివిధ కారణాలతో బీజేపీ, కాంగ్రెస్ కూడా పుంజుకుంటున్నదనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి రాబోయేది తామే అని బీజేపీ, కాంగ్రెస్ నేతలు నానా రచ్చ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీ యాక్టివ్ అయితే పై రెండుపార్టీలకు ఇబ్బందనే అనుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే ఓట్లలో అంత చీలిక వస్తుందని అందరికీ తెలిసిందే. ప్రతిపక్షాల మధ్య ఓట్లు ఎంతగా చీలిపోతే అధికారపార్టీకే  లాభమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకనే టీడీపీ ఎంత బలపడితే కేసీయార్ అంత హ్యాపీస్.



మరింత సమాచారం తెలుసుకోండి: