
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌లోని కేటీఆర్ వర్గం పాల్గొనకపోవడం గమనార్హం. అంతేకాదు, పార్టీ అధినేత కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే నాయకులు కూడా ఈ ఉద్యమం పై తటస్థ వైఖరిని కొనసాగిస్తున్నారు. దీంతో, కవిత ఒంటరిగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు అనేది తెలిపోయింది .. జాగృతి కార్యకర్తలు కవిత వెనుక ఉన్నప్పటికీ, పార్టీలోని కీలక నాయకుల నుంచి ఎలాంటి సహకారం లేకపోవడం ఆమె ఉద్యమాన్ని ఒంటరి పోరాటంగా మార్చింది .. మరోవైపు , కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీల అమలుకు సంబంధించి పంచాయతీ స్థాయిలో ఉద్యమాలను నిర్వహించేందుకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో ఆయనకు హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు మద్దతుగా నిలిచారు. అయితే, కవిత ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, ఇద్దరి మధ్య రాజకీయ సమన్వయం లోపించిందనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది.
ఒకే రోజు ఇద్దరు నాయకులు వేర్వేరు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, కానీ ఒకరికొకరు సహకరించకపోవడం బీఆర్ఎస్‌లో అంతర్గత సంక్షోభాన్ని స్పష్టం చేస్తోంది. ఈ విభేదాలు పార్టీ శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని, ఫలితంగా బీఆర్ఎస్ రాజకీయంగా మరింత బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కేటీఆర్, కవితలు తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నప్పటికీ, ఈ విడిపోయిన రాజకీయ వ్యూహం పార్టీ ఐక్యతపై ప్రభావం చూపుతోందని వారు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ ఈ విభేదాలను అధిగమించి, ఒకే గొడుగు కింద ఐక్యంగా పనిచేయకపోతే, తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షంగా దాని ప్రభావం తగ్గిపోయే ప్రమాదం ఉంది. కేసీఆర్ నాయకత్వంలో ఈ రెండు వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటారా లేక ఈ విభేదాలు మరింత లోతుగా మారతాయా అనేది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది.