
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే భద్రాచలం- మల్కాన్ గిరి రైల్వే లైన్ ను ప్రకటించింది. దీంతో భక్తులు సైతం ఆనందాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు మొదలు పెడుతున్న సమయంలో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణానికి.. గుర్తించిన గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో విలీనమయ్యాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటిగా పేరు సొంతం చేసుకున్న భద్రాచలం పేరు రికార్డుల్లో ఉండగా.. స్టేషన్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండబోతోంది. అయితే భద్రాచలం నుంచి అక్కడి వరకు వెళ్లాలి అంటే రోడ్డు మార్గంలోనే వెళ్లాలి. అటు ఇప్పటికే భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ జిల్లా కేంద్రంలో ఉన్నది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాల గిరిజన గ్రామాలకు సైతం జతచేస్తూ మల్కాన్ గిరి -భద్రాచలం రైల్వే లైన్ ని ప్రతిపాదించారు. ఈ లైన్ ను సుమారుగా 173 కిలోమీటర్ల మేరా నిర్మించాలని కూడా ప్రతిపాదన తీసుకువచ్చారు. అంతేకాకుండా చాలా చోట్ల వంతెనలు, బ్రిడ్జ్ ల నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక కూడా రూపొందించారు. ఈ మేరకు ఒడిస్సాలో జేపూర్ వరకు, మళ్లీ అక్కడి నుంచి మల్కాన్ గిరి, తిరిగి మళ్లీ భద్రాచలం వరకు ఈ లైన్ ఉంటుందని అధికారులు వెల్లడించారు. మొదట ఈ నిర్మాణం కోసం రూ.2800 కోట్లు అవుతుందని.. ఆ తర్వాత 3,592 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
ఒడిస్సా లోని మల్కాన్ గిరి, కోవాసిగూడ, బదలి, మహారాజ్ పల్లి, రాజన్ గూడ, లూనిమన్ గూడ స్టేషన్ లు, ఇక ఆంధ్రప్రదేశ్ లో కుట్టుగుట్ట, పల్లు, కన్నాపురం, నందిగామ ప్రాంతాల మీదుగా భద్రాచలం లోకి ప్రవేశిస్తుంది. ఈ నేపథ్యంలోనే భద్రాచలంలో స్థల సమస్యల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉండే పిచుకులపాడు, ఎటపాక తదితర గ్రామాల వద్ద రైల్వే స్టేషన్ ని నిర్మించాలంటూ అధికారులు అంచనా వేశారు. అక్కడి నుంచి తెలంగాణలోని నదికి అటువైపు ఉన్న పాండురంగాపురం వరకు గోదావరి పై రైల్వే బ్రిడ్జితో అనుసంధానం చేసే అవకాశం ఉన్నదట.
అలాగే తెలంగాణలో కొత్తగూడెం, చత్తీస్గడ్ లో కిరండోల్ వరకు 160.33 కిలోమీటర్ల వరకు ఈ ప్రతిపాదన ఉన్నది. ఇందుకు కీలకంగా భద్రాచలం స్టేషన్ తో పాటుగా గోదావరి రైల్వే బ్రిడ్జి వంతెన కీలకం. ఒకవేళ ఇది పూర్తి అయితే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి భద్రాచలానికి రైల్వే రవాణా సౌకర్యం లభిస్తుంది. రాష్ట్ర విభజనతో ఇప్పటికే భద్రాచలం చాలా నష్టాలను చవిచూస్తోంది. విలీన గ్రామపంచాయతీలను తిరిగి మళ్లీ తెలంగాణలోకి తీసుకోవాలని, దీనివల్ల భద్రాచలం రైల్వే స్టేషన్ భద్రాచలంలోని ఉంటుందని అక్కడి ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నారు.
ప్రస్తుతం భద్రాచల రైల్వే స్టేషన్ ప్రతిపాదన తీసుకువచ్చిన గ్రామాలు ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచల గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నవి.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విభజన క్రమంలో ఈ గ్రామాలను ఏపీలోకి కలిపేశారు.. ముఖ్యంగా కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక, పిచుకలపాడు గ్రామపంచాయతీలను తిరిగి మళ్లీ తెలంగాణలో విలీనం చేయాలని అక్కడ గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం జోక్యం చేసుకొని తెలంగాణలో ఈ గ్రామాలను కలిపితేనే శాశ్వత పరిష్కారం ఉంటుందని, దీంతో రైల్వే స్టేషన్ కూడా భద్రాచలం రైల్వే స్టేషన్ తెలంగాణలోనే ఉంటుందని భావిస్తున్నాయట. దీంతో పురుషోత్తపట్నం గ్రామస్తులు, దేవస్థానం భూములపై ఆలయ వర్గాలకు మధ్య జరుగుతున్న గొడవలకు సైతం పుల్ స్టాప్ పడే అవకాశం ఉన్నది.