
ముఖ్యంగా 28 వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని అలాగే 12వ PRC కూడా నియమించకపోవడంపై, 30% మధ్యంతర భృతి ప్రకటించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పి.ఆర్.సి పై 16 నెలలుగా కాలయాపన చేస్తున్నారు తప్ప ఉపాధ్యాయులకు రావలసినటువంటి నాలుగు డీఏలను ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాల్సిందే అంటూ తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వం పెట్టిన హై స్కూల్ ప్లస్ పునరుద్దించాలని, దొడ్డిదారి బదిలీలను సైతం ఒప్పుకోమని మహాధర్నాలో ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొంటూ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు.
అలాగే 1998లో డీఎస్సీలో మిగిలిపోయిన వారికి పోస్టింగులు ఇవ్వాలని, 1998, 2008 డిఎస్సీ అభ్యర్థులను కూడా రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేయాలంటూ డిమాండ్ చేశారు. పేద బాలికల కోసం అప్పటి ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ లను ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం వాటిని కాలరాయడమే చేస్తోంది అంటూ హెచ్చరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులతో చర్చించలేదు, కేవలం శాసనసభలలో మైకుల ముందు ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఏమీ లేదంటు హెచ్చరిస్తున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి బోధనేతర పనులను బహిష్కరిస్తామంటూ తెలియజేస్తున్నారు. మరి ఈ విషయం పైన కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.