అమిత్ షా మాట్లాడుతూ.. “ఒకవేళ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రంలో మూడు కొత్త మంత్రిత్వ శాఖలు పుట్టుకొస్తాయి — అవే హత్యల శాఖ, కిడ్నాప్ శాఖ, దోపిడీ శాఖ. ఆర్‌జేడీ పాలనలో మళ్లీ జంగిల్ రాజ్ తిరిగి వస్తుంది. ప్రజలు మరోసారి ఆ దారుణ పరిస్థితిని చూడాల్సిన అవసరం లేదు” అని అన్నారు. తాజాగా జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో లాలూ కుటుంబం, ఆర్‌జేడీ పార్టీలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ షా అన్నారు — “లాలూ కంపెనీ, రాహుల్ కంపెనీ రూ.12 లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డాయి. వారిని నమ్మడం అంటే మళ్లీ దోపిడీ, మోసం, జంగిల్ రాజ్‌నే ఆహ్వానించడం” అని మండిపడ్డారు.
“సోనియా, మన్మోహన్, లాలూ జమానాల్లో ఉగ్రవాదులు దేశంలో దాడులు జరిపి, చివరికి జైల్లో బిర్యానీలు తిని ఆనందించేవారు. కానీ మోదీ జమానాలో పరిస్థితి పూర్తిగా మారింది. ఇప్పుడు ఉగ్రవాదులను చంపి, వారి నివాసాలను నేలమట్టం చేస్తాం. దేశ భద్రతకు మోదీ అంకితభావంతో పని చేస్తున్నారు” అని తెలిపారు. అమిత్ షా తన ప్రసంగంలో ఎన్డీయే (ఐక్యతను కూడా వివరించారు. “మహాఘట్బంధన్ పార్టీల్లో సీట్ల కోసం తగవులు, కొట్లాటలు జరుగుతుంటే, ఎన్డీయేలోని ఐదు భాగస్వామ్య పార్టీలు — బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ (ఆర్వీ), హెచ్ఏఎం, కుశ్వాహా పార్టీలు — బిహార్ భవిష్యత్తును నిర్మించేందుకు ‘పంచపాండవులు’లా ఒకే దిశగా కృషి చేస్తున్నాయి” అని అన్నారు. అమిత్ షా పేర్కొన్న ఈ వ్యాఖ్యలు, ఎన్డీయే ఐక్యతను బలపరచడమే కాకుండా, ప్రత్యర్థుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను బహిర్గతం చేశాయి.
            
                            
                                    
                                            
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి