దీపావళి అంటేనే దీపాల పండుగ. అందుకే దీనిని దీపోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా దీపాల వెలుగులతో ఈ లోకం నిండిపోతుంది. అయితే సాధారణంగా ప్రపంచంలోని హిందువులందరూ తమ ఇళ్లల్లోని పూజ గదిలో మరియు దేవాలయాల్లో దేవుడి ఎదుట దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు. మరికొంతమంది ఉదయం మరియు సాయంకాలం దీపాలను వెలిగిస్తూ ఉండారు. మరికొందరు రాత్రి, పగలు దీపం వెలుగుతూ ఉండేలా అఖండ దీపం వెలిగించి ఉంచడాన్ని మనం నిత్యం చూస్తూ ఉంటాం.
అంతేకాదు శుభకార్యాల సమయంలో.. ఏదైనా కొత్త పనులు ప్రారంభించే సమయంలో కూడా దీపాలను వెలిగించడాన్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. అయితే ప్రతి ఒక్క కార్యక్రమానికి దీపం ఎందుకని వెలిగిస్తారు..ఈ సంప్రదాయం ఎప్పటి నుండి వచ్చిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హిందూ మతంలో ప్రతిరోజూ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం...

దీపం అనేది అనుకూలత(పాజిటివ్)కు చిహ్నంగా భావిస్తారు. అంతేకాదు ఈ దీపం వెలిగించడం వల్ల పేదరికం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు. హిందూ మతం ప్రకారం, దీపం వెలిగించడానికి కారణం ఏంటంటే.. అజ్ణానం అనే చీకటిని తొలగించి.. మన జీవితంలో వెలుగులు నింపేదే దీపం. అదే సమయంలో దీపాలను నెయ్యితో వెలిగిస్తే.. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని.. దీని వల్ల లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉంటుందని చాలా మంది నమ్మకం. అదొక్కటే కాదు.. తాంత్రిక పూజలను విజయవంతం చేయడానికి నెయ్యి దీపం మరియు నూనె దీపాన్ని ఉపయోగిస్తారు.
 
దీపంలో వెలిగించేందుకు ఆవు నెయ్యినే ఎందుకు వాడాలంటే.. అందులో సూక్ష్మజీవులను నాశనం చేసే సామర్థ్యం ఉంటుంది. ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే.. అది వాతావవరణాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. దీపం వెలిగించడం వెనుక మరో శాస్త్రీయ కారణం కూడా ఉంది. మీరు మీ ఇంట్లో స్వచ్ఛమైన దేశీ నెయ్యి లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే, దాని పొగ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించి.. సానుకూల శక్తిని ఇస్తుంది. అంతేకాదు ఇంట్లో ఉండే బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. మరో విశేషమేమిటంటే.. దీపం ఆరిపోయిన తర్వాత సుమారు నాలుగు గంటల వరకు దీని ప్రభావం ఉంటుంది.

 పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని సకల ప్రాణ కోటి మనుగడుకు ఉపకరించే కాంతిని అందిస్తోంది. దీపాల వెలుగును సరిగ్గా గమనిస్తే.. నీలం, పసుపు, ఎరుపు, రంగులు కనిపిస్తాయి. ఈ మూడు రంగులు సత్వా, రజో, స్తమ గుణాలకు ప్రతీకలుగా వేదాలు చెబుతాయి. ఈ మూడు గుణాలు జగత్తును పాలించే లక్ష్మీ, పార్వతి, సరస్వతిదేవిగా పురాణాలు చెబుతున్నాయి. అంతటి మహత్యం ఉన్న దీపాన్ని వెలిగించడమంటే.. జీవిత ఎదుగుదలకు అవసరమైన సందేశాన్ని తీసుకోవడమని పెద్దలు చెబుతారు. కావున దీపావళి రోజుతో పాటు కార్తీక పౌర్ణమినాడు దీపాన్ని వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: