
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చరిత్ర సృష్టించింది. పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించి, 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించి తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న RCB అభిమానుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. విజయోత్సవాలు రోడ్లపైకి వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రెండ్స్, సెలబ్రేషన్స్ తో క్రికెట్ పండుగగా మారిపోయింది.
ఈ ఘన విజయానికి ప్రధాన కారకుల్లో ఒకరిగా నిలిచిన విరాట్ కోహ్లీ.. మ్యాచ్ ముగిసిన వెంటనే భావోద్వేగానికి లోనయ్యారు. 2008 నుండి ఆర్సీబీ తరపున క్రికెట్ ఆడుతున్న కోహ్లీకి ఇది మొదటి ఐపీఎల్ టైటిల్ కావడం, తన నడకలో భాగమైన 18 ఏళ్ల స్వప్నం నిజం కావడంతో ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం సహజమైంది. అభిమానుల మనసులను తాకిన ఈ క్షణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇకపోతే, కోహ్లీకి అభిమానులలో అభిమానిగా నిలిచిన అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కూడా ఈ విజయం సమయంలో ఎమోషనల్ అయ్యాడు. అయాన్ RCB విజయం చూసిన వెంటనే ఆనందాన్ని చాటుతూ ఇంట్లోనే నేలపై పడిపోయి ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత తలపై నీళ్లు పోసుకుంటూ తన ఫుల్ జోష్‌ను వ్యక్తం చేశాడు. అయాన్ విజయం పై తన రియాక్షన్‌ను చూపిస్తూ అల్లు అర్జున్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో అయాన్ "నాకు కోహ్లీ అంటే చాలా ఇష్టం. ఆయన వల్లే నాకు క్రికెట్ అంటే ఇష్టం పెరిగింది." దీనికి బన్నీ స్పందిస్తూ "నీ ముఖం వెలిగిపోతోంది రా.." అంటూ అయాన్ బుగ్గల్ని ప్రేమగా గిల్లిన క్షణం హృదయాలను తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఎబీ డివిలియర్స్ వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఆడినప్పటికీ, టైటిల్ మాత్రం RCBకి దక్కలేదు. ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి ప్రతి ఏడాది "ఈ సాలా కప్పు నమ్మేదే" అన్న నినాదంతో ఎప్పుడూ ఆశలు పెంచిన ఆర్సీబీ… ఎట్టకేలకు 2025లో ఆ ఆశను నిజం చేసింది. ఈ సీజన్‌లో అసాధారణ ప్రదర్శన చేసి టైటిల్ దక్కించుకుంది.
విజయం అనంతరం బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు విజయోత్సవాల్లో మునిగిపోయారు. బాణాసంచాలు, కేరింతలు, డ్యాన్స్‌లు, డ్రమ్ములతో నగరాలు వేడెక్కిపోయాయి. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు, సెలబ్రిటీలు తమ అభినందనలు తెలియజేశారు. ఈ విజయం RCB అభిమానులకు మరపురాని గుర్తుగా నిలవనుంది. కోహ్లీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఈ ఐపీఎల్ టైటిల్, అభిమానుల్లో క్రికెట్ పట్ల ఉన్న ప్రేమను మరోసారి స్పష్టంగా చూపించింది.