కుటుంబసభ్యులు వద్దు వద్దు అని చెప్పిన ఆ యువతి మాత్రం అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. అతను నన్ను ప్రాణంకంటే ఎక్కువ ప్రేమించాడు.. పువ్వుల్లో పెట్టుకుని ఏ కష్టం రాకుండా చూసు కుంటాడు. అతనితో అయితేనే జీవితాంతం సంతోషంగా ఉంటాను అంటూ ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం తల్లిదండ్రులతో గొడవ కూడా పెట్టుకుంది యువతి. చివరికి అతికష్టం మీద పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్ళి అయిన ఆరు నెలలకే భర్త అసలు స్వరూపం బయట పడింది. అదనపు కట్నం కావాలి అంటూ భర్త వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లికి ముందు వరకు నువ్వే ప్రాణం అంటూ వెంట తిరిగిన వాడు ప్రాణాలు తీస్తా అంటూ బెదిరించడం మొదలుపెట్టాడు.


 ఇలా ప్రేమించిన వాడే చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటే తల్లిదండ్రులకు చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయింది. చివరికి ఆత్మహత్య శరణ్యం అని భావించి బలవన్మరణానికి పాల్పడింది. నల్గొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన 21 ఏళ్ల రమాదేవి అదే మండలం తుమ్మల పెన్పహాడ్ గ్రామానికి చెందిన విజయ్ ను ప్రేమించింది. 6 నెలల క్రితమే పెద్దలను అతి కష్టంమీద ఒప్పించి వివాహం చేసుకుంది. ఇక పెళ్లి సమయంలో కట్నంగా  నగదుతో పాటు ఒక ప్లాట్ మండల కేంద్రంలోని వ్యవసాయ భూమిని కూడా విజయ్ కి ఇచ్చారు రమాదేవి తల్లిదండ్రులు. వృత్తిరీత్యా విజయ్ ఆటోడ్రైవర్ కావడంతో సూర్యాపేటలో  కాపురం పెట్టారు.


 కొన్నాళ్ల పాటు కాపురం సాఫీగానే సాగింది. కానీ ఆ తర్వాత అదనపు కట్నం తేవాలని భర్త అత్తమామలు బెదిరించడం మొదలుపెట్టాడు. ఇక నువ్వే నా  ప్రాణం అంటూ ప్రేమించాలని వెంట తిరిగిన భర్త విజయ్ చిత్రహింసలకు గురి చేస్తూ ఉండడంతో రమాదేవి మనస్థాపానికి గురయింది. ఇటీవలే గుర్తుతెలియని టాబ్లెట్ మింగింది.  పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు వదిలింది. తండ్రి పిచ్చయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త అత్తమామల ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: