నాగసౌర్య.. ప్రస్తుతం టాలీవుడ్ లో చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న యువహీరో. కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలు చేసి 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా నాగసౌర్య ని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది. 'కల్యాణ వైభోగమే' 'ఛలో' సినిమాలతో తన కెరీర్లోనే సాలిడ్ హిట్ అందుకున్నాడు. కానీ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి బొక్కబోర్లా పడ్డాడు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'అశ్వథామ' సినిమాతో ఒక మోస్తరు హిట్ అందుకున్నాడు. 'ఊహలు గుస గుసలాడే' సినిమాతో తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌ తో మూడో ప్రయత్నంగా హీరో నాగశౌర్యతో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఆగిపోయిందంటూ గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో అనేకవార్తలు వస్తున్నాయి. బడ్జెట్‌ పెరిగిపోవడం, ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌పై దర్శకనిర్మాతలు అసంతృప్తిగా ఉండటంతో సినిమాను ఆపేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ స్పందించింది. నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్‌ 50 శాతం పూర్తయింది. చాలా అద్భుతంగా సినిమా రూపొందుతోంది. మిగతా షూటింగ్‌ యూఎస్‌ఏలో ప్లాన్‌ చేశాం. వీసాల కోసం వేచి చూస్తున్నాం. యూఎస్‌ఏ షెడ్యూల్‌ కూడా త్వరగానే పూర్తిచేస్తాం. ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవి... పుకార్లను నమ్మకండి’ అంటూ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ స్పందించింది.

 

అయితే ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా బృందం మూడు లేదా నాలుగు నెలలు లేకపోతే అంతకంటే ఎక్కువ అమెరికాకు వెళ్లే అవకాశం లేదు. కాబట్టి డైరెక్టర్ ను కథను ఇండియాలోనే చిత్రీకరించడానికి వీలుగా మార్చాలని నిర్మాతలు అడిగారట. అయితే సగం షూటింగ్ పూర్తి అయిపోవడంతో మార్చడం అంత తేలిక కాదని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో కరోనా పరిణామాలు ఎలా ఉంటాయనే దాన్ని బట్టి ఈ సినిమా భవితవ్యం ఉంటుందని చెప్పవచ్చు. నాగ శౌర్య వరుస వైఫల్యాలతో బాగా ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం ఒక మంచి హిట్ పడితే కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేని పరిస్థితి. ప్రస్తుతం మహిళా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తున్న ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. దీంతోపాటు మహేష్ కోనేరు నిర్మాణ సారథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: