తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల పాత హిట్ సినిమాల రి రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగింది. అయితే, ఈ ట్రెండ్ కొత్త సినిమాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని హీరో మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘భైరవం’ థియేటర్లలో మంచి స్పందనతో ప్రదర్శించబడుతుండగా, అదే రోజు మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ రి రిలీజ్ కావడంతో కలెక్షన్లపై ప్రభావం చూపిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక భైరవం సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో మాట్లాడిన మంచు మనోజ్ మాట్లాడుతూ.. ఒక కొత్త సినిమా విడుదలవుతున్న సమయంలో పాత సినిమాలను తిరిగి విడుదల చేస్తే, అవి కొత్త సినిమాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇది ఒక తెలుగు సినిమాను మరో తెలుగు సినిమా చేత చంపేలా ఉంది. కొత్త సినిమాలకు ఇది నష్టమే అని అన్నారు. ఈ సమస్యపై తెలుగు ఫిలిం ఛాంబర్ చర్చించాల్సిన అవసరం ఉందని కోరారు. ఇప్పటివరకు ఈ విషయం మీద చర్చ జరిగిందా అనేది తెలియదు కానీ, ఇప్పుడు అయినా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాలి. రి రిలీజ్ కావాలంటే వీకెండ్‌లలో కాకుండా వీక్‌డేస్‌లో చేయాలని నా అభిప్రాయం అని మనోజ్ వివరించారు.

మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన భైరవం మే 30న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మలయాళ హిట్ మూవీ గరుడన్కు రీమేక్‌గా రూపొందింది. తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మీడియా సమావేశంలో నిర్మాతలు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఒకే సమయంలో పాత సినిమా రి రిలీజ్ చేస్తే, కొత్త సినిమాకు ఖచ్చితంగా కలెక్షన్లపై ప్రభావం ఉంటుంది. ఈ విషయంలో పరిశ్రమ మొత్తం కలసి ఒక సలహా, నిర్ణయం తీసుకోవాలన్నారు.


మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ పరిశ్రమకు ఇది ఒక తగిన సూచన కావొచ్చు. ప్రేక్షకుల ఆసక్తి, థియేటర్ల లభ్యత, ప్రమోషనల్ క్యాంపెయిన్స్ అన్నీ కలిపి కొత్త సినిమా విజయాన్ని నిర్ణయించడంలో కీలకమైన సమయంలో, రి రిలీజ్ సినిమాలు ఆటంకం కలిగిస్తుండటం ఆలోచించాల్సిన అంశమే. ఫిలిం ఛాంబర్ ఈ విషయంపై స్పందించి, సమర్థవంతమైన చర్యలు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: