
ఇప్పుడు రాజమౌళి తన అత్యంత విజయవంతమైన ప్రాజెక్ట్ “బాహుబలి”ను మరో కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. “బాహుబలి: ది ఎపిక్” పేరుతో, రెండు భాగాలను కలిపి, రీ-కట్ చేసి, రీ-మాస్టర్ చేసిన ఈ వెర్షన్ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈసారి కూడా టికెట్ రేట్లు పెంచుతారని అందరూ ఊహించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఎలాంటి టికెట్ ధర పెంపు ఉండదట. ఇండియాలోనూ, ఓవర్సీస్ మార్కెట్లోనూ సాధారణ ధరలకే ఈ ఎపిక్ సినిమాను ప్రదర్శించనున్నారు. ఇలా పాత సినిమాలను రీ రిలీజ్ చేసి టిక్కెట్ రేట్లు పెంచడం అంటే తెలుగు ప్రేక్షకుల సినిమా బలహీనతను ఆసరగా చేసుకుని మరింత పెద్ద దోపిడీకి తెరలేపినట్టు అవుతుంది.
ప్రభాస్, రానా దగ్గా బాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా కీలక పాత్రల్లో నటించిన ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామాను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మించారు. ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయనుంది. ఈ రీ-మాస్టర్ వెర్షన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో, మరోసారి బాహుబలి మేనియాను పునరావృతం చేస్తుందో ? లేదో ? చూడాలి.