దేశమంతా కరోనాతో అల్లాడిపోతోంది. రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా రోగాన బారిన పడుతున్న వారి సంఖ్య ఊహించని రీతిలో పెరిగిపోతోంది.  వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడే పరిస్థితులు కనిపించడం లేదు. అయినా ప్రభుత్వాలు మళ్లీ లాక్‌డౌన్ ఆలోచన  చేయడం లేదు. కానీ ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాలు మాత్రం కరోనాను తేలిగ్గా తీసుకోవడం లేదు. దేశంలో వైరస్ ప్రవేశించిన దగ్గర నుంచి తమ గూడేల్లోకి మహమ్మారి రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకున్నాయో..అవే జాగ్రత్తలు ఇప్పటికీ పాటిస్తున్నాయి. 

 

విసిరేసినట్టుంటే గూడేలు... దూరదూరంగా ఉండే జనాలు.. చేతులు కలపని ఆచారం...ఏజెన్సీ కరోనా రహిత ప్రాంతంగా మారడంలో కీలక పాత్ర ఆదివాసీల జీవన విధానమే. కరోనా కట్టడి చేసేందుకు తొలినాళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చర్యలే తీసుకున్నాయి. వాటిల్లో ప్రధానమైనది లాక్‌డౌన్. ఏజెన్సీ గూడేల్లోనూ అప్రకటిత లాక్‌డౌన్ అమలయింది. ఇప్పటికీ అలాగే అమలు చేస్తున్నారు అడవి బిడ్డలు. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ఏ గూడెం వెళ్లినా..ఆదివాసీలు కరోనా గత్తర 
దరిచేరకుండా తీసుకున్న జాగ్రత్తలు కనిపిస్తాయి. 

 

అడవులను ఆవాసాలుగా చేసుకుని, కొండ గుట్టల్లో నివాసం ఏర్పాటు చేసుకుని పోడు భూముల సాగు చేసుకుంటూ జీవిస్తుంటారు అడవి బిడ్డలు. వీరి జీవనానికి అడవే ఆధారం. నాగరిక జీవనానికి భిన్నంగా...ఎక్కడ పుట్టి పెరిగారో.. ఆ ప్రాంతంలోనే జీవనోపాధి పొందుతారు ఆదివాసీలు. ఇప్పుడు ప్రపంచమంతా ఆదివాసీ సంస్కృతీ సంపద్రాయాలనే పాటిస్తోంది. అదే రాం..రాం... ఇప్పుడు ఈ రాం..రాం..ప్రపంచం పాటిస్తున్న కరోనా జాగ్రత్తల్లో ప్రధానమైనది. 

 

అడవిపై ఆధారపడి జీవనోపాధి పొందుతుంటారు ఆదివాసీలు.  అడవుల్లో దొరికే పండ్లు, ఆకులు,వెదురు,అలాగే వివిధ రకాల గడ్డలతో వీరి జీవనం సాఫిగా సాగిపోతుంది..మరీ ఎక్కువగా అంటే పోడు వ్యవసాయం తప్ప వాళ్లకు ఇంకేమీ తెలియదు. ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంటే... లాక్ డౌన్ తెరపైకి వచ్చింది..దేశాలు, రాష్ట్రాలన్నీ నెలలకొద్దీ లాక్ డౌన్ విధించుకున్నాయి. లాక్‌డౌన్ అంటే...ఇష్టమొచ్చినట్టుగా...రోడ్ల పైకి రావొద్దు...ఇంటికే పరిమితం కావాలి...అంతేకాదు తప్పని సరి పరిస్థితుల్లో వస్తే గుంపులు గుంపులుగా ఉండకూడదు..రెండు నెలలు దేశమంతా లాక్‌డౌన్ అమలయితే...అందరూ బెంబేలెత్తిపోయారు. కానీ ఆదివాసీలు ఇదే విధంగా ఏళ్ల నుంచి... తమ గూడేలకే పరిమితమవుతూ వస్తున్నారు.

 

ఆదివాసీల జీవన విధానమంతా...లాక్‌డౌన్‌ తరహాలోనే ఉంటుంది. వారి జీవనం లాక్ డౌన్ కు దగ్గరగానే ఉంటుంది. తమ జీవితకాలంలో గూడేలను దాటి బయటకు అడుగుపెట్టని అడవి బిడ్డలు ఎంతో మంది ఉంటారు. పట్నం వాసన తెలియని ఆదివాసీలు ఎందరో. ఉప్పు, కారం,నూనె కోసం అంగడికి వస్తారు తప్ప... మిగతావన్నీ వారు పండించినవే తింటారు. ఇలా ఆదివాసీల జీవన విధానం ఏజెన్సీ ప్రాంతాల్లో   కరోనా రహితంగా ఉండడంలో కీలక పాత్ర పోషించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: