మొన్నటి వరకు ఏపీలో మిత్రపక్షంగా చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ ఇప్పుడు శత్రువుగానే భావిస్తున్నట్లుగా వ్యవహరిస్తోంది. ప్రజా సమస్యలను హైలెట్ చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో కొన్ని సీట్లను తమ ఖాతాలో వేసుకోవచ్చు అని బిజెపి అంచనా వేస్తోంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు రాజకీయం మరింత స్పీడు పెంచింది. ఇది ఇలా ఉంటే ఏపీలో తమ మిత్రపక్షంగా కొనసాగుతున్న జనసేన ను కలుపుకుని వెళ్ళే విషయంలో బిజెపి ఎందుకు ప్రయత్నించడం లేదు అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తోంది. బీజేపీ సంగతి అలా ఉంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా తుఫాను బాధితులను పరామర్శించేందుకు జిల్లాల బాట పట్టారు. 


రైతుల సమస్యలను తెలుసుకుంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ పర్యటనలో ఎక్కడా బిజెపి శ్రేణులు కనిపించకపోవడం , కనీసం బిజెపి రాష్ట్ర నాయకులను సంప్రదించకుండానే పవన్ పర్యటన పెట్టుకోవడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఈరోజు బిజెపి ఏపీలో రోడ్ల సమస్య పై ఆందోళన చేపట్టింది. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తో పాటు,  విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్ నాయుడు వంటి కీలక నాయకులంతా రోడ్లపై రాస్తారోకోలు చేశారు. చెరువుల్లా మారిన రోడ్లు, గుంతలను చూపిస్తూ వారు ఆందోళన నిర్వహించారు. 


అయితే ఈ ఆందోళనలో ఎక్కడా జనసేన కనిపించకపోవడంతో,  ఆ పార్టీని సంప్రదించకుండానే బిజెపి రోడ్డు ఎక్కింది అనే విషయం స్పష్టంగా అర్థమైంది. పవన్ జిల్లాల పర్యటన తమకు చెప్పకుండానే చేపట్టడంతో,  బిజెపి రోడ్ల వ్యవహారంపై ఆందోళన కార్యక్రమంలో జనసేన ను కలుపు కు వెళ్లకుండా ఒంటరిగానే కదన రంగం లోకి దూకినట్టుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఏపీ లో బిజెపి జనసేన పార్టీల పొత్తు మాత్రం చిత్ర విచిత్రంగా కొనసాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: