ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వ్యూహాలు ఎంత మారినా, సామాజిక వర్గాల మద్దతు రాజకీయ పార్టీల విజయంలో కీలకంగా మారింది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న పలు సర్వేల ప్రకారం, రాష్ట్రంలోని మూడు ప్రధాన సామాజిక వర్గాలు - కమ్మ, కాపు, రెడ్డి - పార్టీలకు ఎలా మద్దతు ఇస్తున్నాయనే అంశం గమనార్హంగా మారింది. కమ్మ సామాజిక వర్గం ప్రధానంగా టీడీపీకి మద్దతుగా నిలుస్తోంది. సర్వేల ప్రకారం, సుమారుగా 70-80 శాతం మంది కమ్మల మద్దతు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ వైపే ఉంది. మరో 1-2 శాతం కమ్మలు మాత్రం వామపక్ష పార్టీల వైపు చూస్తుండగా, వైసీపీకి మద్దతు ఇచ్చేవారు 20-30 శాతానికి మించరని సర్వేలు వెల్లడిస్తున్నాయి.


ఇక కాపుల విషయానికొస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావంతో ఈ వర్గం పెద్ద మొత్తంలో జనసేన వైపే మొగ్గు చూపుతోంది. సర్వేల ప్రకారం, 70-80 శాతం కాపులు జనసేనను బలపరుస్తున్నారు. మిగిలిన వారు 10-15 శాతం టీడీపీకి, 10 శాతం వైసీపీకి మద్దతు ఇస్తున్నట్టు పేర్కొనబడింది. తటస్థంగా ఉన్న వారు 2-3 శాతం మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో, అసలైన ప్రశ్న రెడ్డి సామాజిక వర్గంపై ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి తరువాత, జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని రెడ్డి వర్గం బలమైన నాయకుడిగా చూసింది. కానీ, 2019 తరువాత రెడ్డిల మద్దతు గణనీయంగా తగ్గిందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.



గతంలో 70 శాతం మంది రెడ్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఈ సంఖ్య 42 శాతానికి పరిమితమైందని పేర్కొనబడింది. మిగిలిన 35 శాతం టీడీపీకి గట్టి మద్దతు ఇస్తుండగా, 10 శాతం జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. తటస్థంగా ఉన్నవారు 5 శాతం. ఈ గణాంకాలు చూస్తే, వైసీపీకి ఓదార్పు అవసరం. రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చే మద్దతు చీలికగా మారుతున్న నేపథ్యంలో, జ‌గ‌న్ పునరాలోచన అవసరమన్న అభిప్రాయం విశ్లేషకులలో వ్యక్తమవుతోంది. రాజకీయంగా బలంగా ఉండాలంటే, సామాజిక వర్గాల ఐక్యతే కీలకం. అటువంటి సమయంలో, వైసీపీకి ఇప్పటికే కోల్పోయిన మద్దతు తిరిగి పొందేందుకు వ్యూహాలను మారుస్తేనే ఫలితాలు కనపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: