
అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల సంఖ్యను పెంచడానికి వీలు కల్పించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా, తెలంగాణలో 119 స్థానాలు ఉన్నాయి. ఈ సంఖ్యలను వరుసగా 225 మరియు 153కు పెంచే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170లలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం, 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణన వరకు నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన గురించి ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా సుప్రీం కోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగ పరిధికి లోబడే జరగాలని పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కు లోబడి ఉందని సుప్రీమ్ కోర్టు స్పష్టం చేయడం గమనార్హం.
2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ఉంటుందని తెలుగు రాష్ట్రాలకు డీలిమిటేషన్ చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ తరహా డిమాండ్లు వెల్లువెత్తుతాయని కోర్టు అభిప్రాయపడింది. నియోజకవర్గాల సంఖ్యను పెంచడం లేదా వాటి సరిహద్దులను మార్చడం రాజకీయంగా సున్నితమైన అంశం. ఏ నియోజకవర్గంలో మార్పులు జరిగినా, అది రాజకీయ పార్టీలు, నాయకుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. నియోజక వర్గాల స్థానాల సంఖ్య పెరిగితే, కొత్త మౌలిక సదుపాయాలు, నిధుల కేటాయింపు అవసరం అవుతుంది.