కొడాలి నాని.. జగన్ ప్రభుత్వంలో మంత్రి.. మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉన్నా.. ఆయన తరచూ తన మాటల ద్వారానే వార్తల్లో కనిపిస్తుంటారు. ప్రత్యేకించి టీడీపీపై విమర్శించే సమయంలో ఆయన దూకుడు మామూలుగా ఉండదు.. అందులోనూ విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రస్తావన వస్తే ఇక ఆయన నోరు కంట్రోల్‌లో ఉండదు.. ఆయన్ను ఆయన మరచిపోయి మరీ ఘాటు పదజాలం వాడేస్తుంటారు. పాపం.. అందుకే ఆయన ప్రెస్‌ మీట్లలోనూ .. లోకేశ్‌ ప్రస్తావన తన వద్ద తీసుకురావద్దని.. తెస్తే.. ఏం అంటానో నాకే తెలియదని అనే స్థాయిలో మాట్లాడారు.


తాజాగా గుడివాడలో క్యాసినో నిర్వహించారనే అంశంపై తెలుగు దేశం పార్టీ వారం రోజులుగా పోరాటం చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా మంత్రి కొడాలి నాని సొంతూరు గుడివాడలో ఏకంగా మంత్రి కన్వెన్షన్‌ సెంటర్‌లోనే క్యాసినో ఆడించారని.. మద్యం ఏరులై పారిందని.. జూదం ఆడించారని.. అమ్మాయిలతో అసభ్య నృత్యాలు చేయించారని.. ఇలా టీడీపీ ఓ వారం రోజులుగా ఇదే ఇష్యూపై బాగా పోరాడుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని విడుదల చేసింది.


ఏపీకి ఇప్పటి వరకూ జగన్ మూడు రాజధానులు అంటున్నారని..కానీ గుడివాడను జూద రాజధానిగా చేసి నాలుగు రాజధానులు చేయాలని వ్యంగ్యంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. అంతే కాదు.. గుడివాడలోని కె కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్తామంటూ టీడీపీ నిజనిర్ధారణ కమిటీ మొన్న అక్కడకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ పరిణామాలపై టీడీపీ ఏకంగా డీజీపీని కూడా కలిపేసి విమర్శించింది. ఆయనకు కూడా కేసినోలో వాటాలున్నాయని తీవ్రంగా ఆరోపించింది.


ఈ ఆరోపణలపై స్పందించేందుకు నిన్న బయటకు వచ్చిన కొడాలి నాని.. మరోసారి చంద్రబాబును, లోకేశ్‌నూ తీవ్రపదజాలంతో  విమర్శించారు. లోకేశ్‌ కృష్ణానది ఒడ్డున ఉన్న తన ఇంట్లో గోవా నుంచి అమ్మాయిలను తెచ్చుకుని క్యాబరే డాన్సులు ఆడారని విమర్శించారు. ఇక చంద్రబాబునైతే రాయలేని భాషలో తనదైన శైలిలో లైవ్‌లోనే ఏకేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: