తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని ఎత్తిపోసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రాజెక్టును ఆపివేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ మరోసారి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గోదావరి నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ రాష్ట్రం కోరింది. జీఆర్ఎంబీ ఛైర్మన్ కు ఈ మేరకు తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ తాజాగా లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది.


పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకునే హక్కు ఏపీకి లేదని తెలంగాణ అంటోంది. గత నవంబర్ లో జరిగిన బోర్డు సమావేశంలోనే ఈ అంశంపై తమ అభిప్రాయం స్పష్టంగా చెప్పామని ఈఎన్సీ తన లేఖలో గుర్తు చేశారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యటన సందర్భంగా అక్కడ పనులు జరుగుతున్నట్లు గుర్తించారట. ఈ పనులు ఆపాలని పీపీఏ ఛైర్మన్ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేస్తోంది.


ఈ నెల 20వ తేదీన దిల్లీలో సమీక్ష సందర్భంగా కూడా కేంద్ర జలశక్తి శాఖ కొత్త ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలంగాణ ఈఎన్సీ తన లేఖలో ప్రస్తావించారు. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టు వల్ల గోదావరి డెల్టా సిస్టం ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గోదావరి డెల్టా సిస్టం సహా దిగువనున్న ప్రాజెక్టులకు నీటిలభ్యత లేదని తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ఎలా చేపడుతుందని తెలంగాణ ప్రశ్నిస్తోంది.


అందుకే ఈ వివాదాలు అన్నీ ఉన్నందున ప్రాజెక్టును ఆపివేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణఎస్సీ జీఆర్‌ఎంబీకి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. ఈ విషయంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు తక్షణం జోక్యం చేసుకొని ఆలస్యం చేయకుండా ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఈఎన్సీ తన లేఖలో కోరారు. మరి బోర్డు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: